
బషీర్బాగ్, వెలుగు: దేశంలో ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలని ఆర్థిక వేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ అనుబంధ మోర్చాగా మారిపోయిందని విమర్శించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాగో నవ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలతో ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకునే దిశగా మారిపోయిందన్నారు.
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఐదు కోట్ల ఓట్లను అదనంగా లెక్కించిందని, 15 రాష్ట్రాల్లో 79 ఎంపీ స్థానాలపై ప్రభావం చూపిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే యూపీఏ కూటమికి 313 సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చేదన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ను ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో సమావేశం నిర్వహించి నియమించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను మినహాయించి కేంద్రమంత్రిని చేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, పలు సంఘాల నేతలు కందిమల్ల ప్రతాపరెడ్డి, అఫ్జల్ అజీజ్, ప్రొఫెసర్ వెంకటదాస్, సోగారాబేగం, నయనాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.