- యాక్సిడెంట్‌తో కాళ్లు చచ్చుబడ్డయ్.. 12 ఏండ్ల తర్వాత నడిచిండు
- మెదడుకు, వెన్నెముకకు కనెక్షన్ కట్
- టెక్నాలజీతో కలిపిన స్విట్జర్లాండ్ న్యూరో సైంటిస్టులు
జెనీవా: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మెడ విరిగింది. అతని మెడలో నాడులు దెబ్బతినడంతో మెదడు, వెన్నెముకకు మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయింది. దాంతో అతని కాళ్లు రెండూ చచ్చుపడిపోయాయి. మంచం మీది నుంచి కదలలేని స్థితిలోకి జారిపోయాడు. విషయం తెలుసుకున్న న్యూరో సైంటిస్టులు టెక్నాలజీ సాయంతో ఎంతో కష్టపడి అతని బ్రెయిన్ కు-, వెన్నెముకకు కనెక్షన్ ఇచ్చారు. పన్నెండేండ్ల తర్వాత ఇప్పుడు అతను నడవగలుగుతున్నాడు. మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాడు. చచ్చుబడిపోయిన అతని కాళ్లను తిరిగి స్విట్జర్లాండ్ న్యూరో సైంటిస్టులు ‘డిజిటల్ బ్రిడ్జ్’తో మళ్లీ విజయవంతంగా పనిచేయించారు.
సైక్లింగ్ చేస్తూ కిందపడ్డడు
నెదర్లాండ్స్‌కు చెందిన గెర్ట్ జాన్ ఓస్కామ్(40) పన్నెండేండ్ల కింద సైక్లింగ్ చేస్తుండగా కింద పడిపోయాడు. ప్రమాదంలో అతని మెడ విరిగింది. దాంతో అతని మెదడు-, వెన్నెముకకు మధ్య కనెక్షన్ పూర్తిగా కట్ అయ్యింది. దీని వల్ల ఓస్కామ్ శరీరంలోని వివిధ భాగాల నుంచి మెదడూ, వెన్నుపాముకూ.. అలాగే వాటి నుంచి వివిధ భాగాలకు వెళ్లాల్సిన సమాచారం, సంకేతాలు ఆగిపోయాయి. అతని నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో కండరాలు, అవయవాల కదలికలు తగ్గిపోయాయి. ఫలితంగా ఓస్కామ్ కాళ్లు పక్షవాతం వచ్చినట్లుగా కదలికలు లేకుండా పోయాయి. ఎన్ని ఆపరేషన్లు చేసిన ఓస్కామ్ కాళ్లల్లో చలనం రాలేదు. కాళ్లు ఉన్నా నడవలేని అతని దీనస్థితి స్విట్జర్లాండ్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరల్ డి లౌసాన్ (ఈపీఎఫ్ఎల్)కి చెందిన న్యూరో సైంటిస్ట్‌లకు తెలిసింది. వారు ఈ సమస్య పరిష్కరించాలని వివిధ అధ్యయనాలు చేయటం ప్రారంభించారు.
వైర్‌లెస్ ‘డిజిటల్ బ్రిడ్జ్’తో చలనం
ఓస్కామ్‌కు నడక రప్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రయోగాల ద్వారా ఈపీఎఫ్ఎల్ న్యూరో సైంటిస్ట్‌లు టెక్నాలజీ సాయంతో "వైర్‌లెస్ డిజిటల్ బ్రిడ్జ్" అనే పరికరాన్ని తయారు చేశారు. ఇందులో రెండు ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్‌లు ఉంటాయి. ఒక ఇంప్లాంట్ ను ఓస్కాన్ మెదడులో కాళ్ల కదలికలను కంట్రోల్ చేసే ప్రాంతంపైనా.. రెండవదాన్ని నడుము వద్ద వెన్నుపాములో లెగ్స్ కదలికలను నియంత్రించే ప్రాంతంలో అమర్చారు. ఓస్కామ్ నడవాలని అనుకుంటే మెదడులోని ఇంప్లాంట్ నుంచి రిలీజ్ అయిన సిగ్నల్స్ వెన్నుపాములోని మరో ఇంప్లాంట్ కు చేరుతాయి. ఆ సిగ్నల్స్ ను వెన్నుపాములోని ఇంప్లాంట్ డీకోడ్ చేసి.. కావలసిన విధంగా లెగ్స్ కదలడానికి కండరాలను యాక్టివ్ చేస్తుంది. ఇవి రెండూ వైర్‌లెస్‌గా పనిచేస్తాయి.
సైంటిస్టులు చేసిన ఈ అద్భుత ఆవిష్కరణతో ఓస్కామ్ 12 ఏండ్ల తర్వాత నడవగలుగుతున్నాడు. ప్రస్తుతం అతను చేతి కర్రలు, వాకర్ సాయంతో నడుస్తున్నాడు. మెట్లు కూడా ఆగకుండా ఎక్కుతున్నాడు. ఓస్కామ్ మెదడు, వెన్నుపాములో అమర్చిన ఇంప్లాంట్లు వేగంగా పనిచేస్తున్నాయని న్యూరో సైంటిస్ట్ గ్రెగోయిర్ కోర్టిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఓస్కామ్ స్వయంగా నిలబడటానికి, నడవడానికి, మెట్లు ఎక్కడానికి, స్నేహితులతో కలిసి నిలబడి బీరు తాగడానికి కూడా వీలవుతోందని చెప్పారు.ఈ డిజిటల్ బ్రిడ్జ్ వైద్యాన్ని అందరికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తామన్నారు.
