V6 News

పంచాయతీ ఎన్నికలు: అంబులెన్స్‎లో వచ్చి ఓటు వేసిన పెరాలసిస్ పేషెంట్

పంచాయతీ ఎన్నికలు: అంబులెన్స్‎లో వచ్చి ఓటు వేసిన పెరాలసిస్ పేషెంట్

హైదరాబాద్: ఓటు.. వజ్రాయుధం. ఓటు ఎంతో అమూల్యమైనది.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఈ మాటలు వినబడుతుంటాయి. కానీ ఓటింగ్ శాతం మాత్రం ఎప్పుడూ 60, 70 శాతానికి మించదు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఓటు హక్కు గురించి డైలాగులు చెప్పే చాలా మంది కేవలం మాటలకే పరిమితం అవుతారు. రియాల్టీలో ఓటు మాత్రం వేయరు. ఇందుకు సాక్ష్యం రూరల్, అర్బన్ ఏరియాల ఓటింగ్ శాతమే. ఎందుకంటే గ్రామాల్లో ఎక్కువగా పోలింగ్ పర్సెంట్ నమోదు అవుతుంది. 

అదే చదువుకున్న వారు ఎక్కువగా ఉండే సిటీల్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువ నమోదు అవుతోంది. నిరక్షరాస్యులు, వయోవృద్ధులు కూడా ఓటు విలువ తెలుసుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేస్తుంటే, సూటు బూటు వేసుకున్న పెద్దోళ్లు మాత్రం ఓటుహక్కు వినియోగించుకోడానికి చాలా దూరంగా ఉండిపోతున్నారు. 

ALSO READ : తెలంగాణలో జోరుగా పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 

ఇలా.. ఓటు విషయంలో నిర్లక్ష్యం వహించేవారికి కనువిప్పు కలిగించే ఘటన ఒకటి నల్లగొండ జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా పెరాలసిస్‎ వ్యాధితో బాధపడుతోన్న మాజీ ఎంపీటీసీ దండెంపల్లి సత్తయ్య అంబులెన్స్‎లో వచ్చి మరీ ఓటు వేశాడు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ బాధ్యతగా వచ్చి చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నాడు. నడవలేని స్థితిలో కూడా ఓటు వేయడం కోసం అంబులెన్స్‎లో వచ్చిన సత్తయ్యపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సత్తయ్యను ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అంటున్నారు.