అప్పులు చేసి ఫోన్లు కొనిస్తున్నరు..ఆన్ లైన్ క్లాసుల కోసం పేరెంట్స్ తిప్పలు

అప్పులు చేసి ఫోన్లు కొనిస్తున్నరు..ఆన్ లైన్ క్లాసుల కోసం పేరెంట్స్ తిప్పలు
  •     ప్రస్తుతం వినేవారు 70 శాతం మంది
  •      స్మార్ట్ ఫోన్ లేనోళ్లకు అందని చదువు
  •     ఇటీవల ఓ సంస్థ చేసిన  సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పెట్టినా పేరెంట్స్ కు ఇబ్బందులు తప్పటం లేదు. ఓ వైపు ఫీజులు వసూలు చేస్తూనే మరో వైపు ఆన్ లైన్ క్లాస్ ల కోసం స్మార్ట్ ఫోన్లు కొనాలంటూ పేరెంట్స్ పై స్కూల్ మేనేజ్ మెంట్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో పేరెంట్స్ పై స్మార్ట్ ఫోన్ తో పాటు ఇంటర్ నెట్ యాక్సెస్ కోసం మరింత భారం పడింది. లాక్ డౌన్ నాటి నుంచి పనుల్లేక, జాబ్​లు పోయి ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మస్ట్ గా కొనాల్సి పరిస్థితి వచ్చింది. దీంతో పిల్లల భవిష్యత్ కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేయటమో, లోన్ తీసుకోనో, చిట్టిలు ఎత్తో ఎలాగోలా మొత్తానికి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు.

పిల్లల భవిష్యత్ బాగుండాలని..

ఆర్థిక భారమైనా పిల్లల భవిష్యత్ కోసం తప్పుతలేదంటున్నారు పేరెంట్స్. స్కూల్స్ మేనేజ్ మెంట్లు స్మార్ట్ ఫోన్స్ లేకుంటే  పిల్లలు క్లాస్ లు మిస్సైతరని, ఏడాది అకాడమిక్​ ఇయర్​ లాస్ అవుతారని చెబుతున్నారు. దీంతో వాళ్ల భవిష్యత్ కు ఏమీ కావద్దని ఎట్లనన్న చేసి ఫోన్ కొనిస్తున్నామని పేర్కొంటున్నారు. ఆన్ లైన్ క్లాస్ లు మొదలైన కొత్తలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్లు లేకపోవటంతో స్టూడెంట్స్ క్లాస్ లు మిస్సయ్యారు. ముఖ్యంగా లేబర్ పని చేసేటోళ్లు, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్​ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేక సిటీలో దాదాపు 50 నుంచి 60 శాతం మందికి ఆన్ క్లాసులు అందుబాటులో లేకుండే. క్రమంగా పేరెంట్స్ పిల్లలకు ఫోన్లు కొనిచ్చుడు షురూ చేశారు.  ఒక్కసారే 10 వేలు అవసరం పడటంతో లోన్లు, అప్పు చేస్తూ మొత్తానికి పిల్లలు ఆన్ లైన్ క్లాస్ లకు అటెండయ్యేలా చేశారు. దీంతో ప్రస్తుతం సిటీలో ఆన్ లైన్ క్లాస్ లు వింటున్న వారి సంఖ్య 70 శాతానికి పైగా పెరిగిందని ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో తేలింది.

ఇప్పటికీ ఫోన్లు లేనోళ్లు చాలామందే..

ఆన్ లైన్ క్లాస్ లు షురువై దాదాపు మూడు నెలలు గడుస్తున్న ఇంకా ఫోన్లు లేని వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్ల భవిష్యత్ ఏమిటని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. చాలా మంది పేరెంట్స్ కు ఫోన్ కొన్నప్పటికీ దాని వాడకంపై అవగాహన ఉండటం లేదు. నెట్ సౌకర్యం, సిగ్నల్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. దీంతో కష్టపడి ఫోన్ కొనిచ్చినప్పటికీ సరిగా చదువు అందుతలేదని చెబుతున్నారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే ఎంత అడిగిన అప్పు పుడ్తలేదని ఏం చేయలేక పిల్లలకు ఫోన్లు కొనియ్యలేకపోతున్నామని వారు బాధపడతుంటే చూడలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

అప్పుచేసి కొనిచ్చిన..

మా ఆయన చనిపోయాడు. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ మా బాబును చదివిపిస్తున్నా. టీవీలో ఆన్ లైన్ క్లాస్ లు వస్తున్నా అవి ఎప్పుడొస్తయో తెలియదు. దీంతో అప్పు చేసి ఫోన్ కొనిచ్చినా. ఇప్పుడు ఫోన్లనే పాఠాలు వింటున్నాడు.

– లతమ్మ, మహాత్మా గాంధీనగర్ బస్తీ

చిట్టి డబ్బులతో కొన్నా..

నేను రోజు కూలికి పోతా. నా భార్య మూడు ఇళ్లలో పని చేస్తది. మా అబ్బాయి ఆన్ లైన్ క్లాస్ లు వినటానికి మొబైల్లేకుండే. చాలి చాలని జీతాలు వచ్చినా పిల్లల భవిష్యత్ కోసం చిట్టి డబ్బులతో తీసుకొని ఫోన్ కొన్నాం.

‑ రామయ్య, డైలీ లేబర్, ఫిలింనగర్