వచ్చే ఏడాది పాత ఫీజులా.. కొత్త ఫీజులా?

వచ్చే ఏడాది పాత ఫీజులా.. కొత్త ఫీజులా?


హైదరాబాద్, వెలుగు: సమ్మర్ హాలీడేస్ మగుస్తుండటంతో పేరెంట్స్​లో స్కూల్ ఫీజుల భయం మొదలవుతోంది. కిందటేడాది ఫీజులను పెంచొద్దన్న సర్కారు ఆదేశాలను కొన్ని స్కూల్స్ అమలు చేశాయి. కానీ ట్యూషన్ ఫీజుపై స్పష్టత లేకపోవడంతో ఎప్పట్లాగే మొత్తం ఫీజులను పేరెంట్స్​ నుంచి దండుకున్నాయి. కరోనా ఎఫెక్ట్​తో పోయినేడు క్లాసులన్నీ ఆన్ లైన్​లోనే జరిగినప్పటికీ మేనేజ్​మెంట్లు ఫుల్ ఫీజులను వసూలు చేశాయి. వచ్చే (2021–22) అకడమిక్ ఇయర్​లోనూ కొద్దిరోజులు క్లాసులు ఆన్​లైన్​లోనే జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు జూన్ నుంచే ఆన్​లైన్ క్లాసులను స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మేనేజ్​మెంట్లు ఫీజులు పెంచుతాయేమోననే ఆందోళన పేరెంట్స్ లో మొదలైంది. మేనేజ్​మెంట్లు ఫీజులు పెంచుకోవాల్నా.. తగ్గించాల్నా? పాత ఫీజులే వసూలు చేయాలా?  అనేదానిపై ఇప్పటివరకు సర్కారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

సగం క్లాసులకు ఫుల్ ఫీజు గుంజినయ్

రాష్ట్రంలో మొత్తం10,763 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా, వాటిలో 32 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో 2019–20 ఫీజుల్లోని ట్యూషన్ ఫీజును మాత్రమే 2020–21 అకడమిక్ ఇయర్​లో వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ జీవో రిలీజ్ చేసింది. ఐదో తరగతి వరకు అసలు ఫిజికల్ క్లాసులే స్టార్ట్ కాలేదు. ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు కొద్దిరోజులే ఫిజికల్ క్లాసులు జరిగాయి. కొన్ని స్కూళ్లలో ఆన్​లైన్ క్లాసులు కూడా నామమాత్రంగా జరిగాయి. అయినా దాదాపు అన్ని స్కూళ్లు, ఏడాదికి సంబంధించిన మొత్తం ఫీజునే వసూలు చేశాయి. పూర్తిగా ఆన్​లైన్​ క్లాసులకే పరిమితమైన ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ల నుంచి కూడా అంతే ఫీజు వసూలు చేశాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు అయితే శానిటైజేషన్​ పేరిటా ఫీజులు వసూలు చేశాయి. ఈ ఫీజుల వసూళ్లను కంట్రోల్ చేయాలని పేరెంట్స్, స్టూడెంట్ల యూనియన్లు వేడుకున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు.

వచ్చే ఏడాది ఎట్ల.?

ప్రభుత్వం మే 31 వరకు స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించింది. మరో నెలరోజుల్లో 2021–22 కొత్త అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. ఈసారి కూడా దాదాపు సెప్టెంబర్ వరకు ఫిజికల్ క్లాసులకు అవకాశం లేదని విద్యాశాఖ అధికారులే చెప్తున్నారు. దీంతో కొంతకాలం మళ్లీ ఆన్​లైన్ క్లాసులే  నిర్వహించనున్నారు. అయితే డిసెంబర్​లోనే సీబీఎస్ఈ స్కూళ్ల అడ్మిషన్లు పూర్తయ్యాయి. మేనేజ్​మెంట్లు ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా కట్టించుకున్నాయి. ఇటు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలోనూ అడ్మిషన్లు స్టార్ట్ చేశాయి. అయినా ఫీజులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిసారి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్టు అంటూ దాటవేస్తోంది. ఆ కమిటీ రిపోర్టు ఇచ్చి, ఏండ్లు గడుస్తున్నా దానిపైనా కనీసం చర్చ కూడా పెట్టలేదు. ఆ రిపోర్టును సర్కారు బయటపెట్టలేదు.

సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ఫీజులు తగ్గేనా..

ఆన్​లైన్ క్లాసులకు 30 శాతం ఫీజులు తగ్గించాలని  రాజస్థాన్​ సర్కారు అక్కడి స్కూల్ మేనేజ్​మెంట్లను ఆదేశించింది. దీంతో మేనేజ్​మెంట్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 15 శాతం ఫీజులు తగ్గించాలని ఆదేశించింది. దీని ప్రభావం అన్ని రాష్ట్రాలపై పడే అవకాశముంది. మన రాష్ట్రంలో 2020–21లో ఫీజులు తగ్గించాలని చెప్పకపోయినా, ట్యూషన్​ ఫీజును మాత్రమే తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ట్యూషన్​ ఫీజు ఎలా లెక్కగట్టాలో తెలియక మేనేజ్​మెంట్లు మొత్తం ఫీజును వసూలు చేశాయి. ఇప్పుడు రాబోయే అకడమిక్ ఇయర్​లో మాత్రం సగం ఫీజులే వసూలు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.

30 శాతం తగ్గించాలి

నిరుడు ట్యూషన్​ ఫీజులనే తీసుకోవాలని ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులు అమలు కాలే. మేనేజ్​మెంట్లు అన్ని ఫీజులను కలిపి అదే ట్యూషన్ ఫీజు అని చెప్పుకొచ్చాయి. సిలబస్​ తగ్గించారు కాబట్టి ఏపీలో 30శాతం ఫీజులు తగ్గించారు. తెలంగాణలోనూ ఇదే విధానం అమలు చేయాలి. ట్యూషన్​ ఫీజు ఎంతనో స్కూళ్లు ముందే చెప్పాలి. 
- నాగటి నారాయణ, టీపీఏ స్టేట్ ప్రెసిడెంట్

కార్పొరేట్ స్కూళ్లను కంట్రోల్ చేయాలె

బడ్జెట్ ప్రైవేటు స్కూళ్లు పేరెంట్స్​పై భారం పడకుండా ఫీజులు తీసుకుంటున్నాయి. పేరెంట్స్, మేనేజ్​మెంట్ల మధ్య అవగాహనతో ఫీజులు తగ్గిస్తున్నం. కానీ, కార్పొరేట్ స్కూళ్లు మాత్రం రకరకాల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రభావం బడ్జెట్ స్కూళ్లపై పడుతోంది. అడ్డగోలు ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి.
- యాదగిరి శేఖర్​రావు,ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్