పిల్లలకు సోషల్ అకౌంట్లు

 పిల్లలకు సోషల్ అకౌంట్లు
  •  ఫేమ్ కోసం పేరెంట్స్ వీడియోలు
  • ట్రెండింగ్​లో ఉన్న పాటలు, మాటలు, డ్యాన్స్​లతో రీల్స్ 
  • లైక్​లు, కామెంట్లు, షేరింగ్, ఫాలోవర్స్ కోసం ఆరాటం 
  • పిల్లల బ్రెయిన్, ఫ్యూచర్ పై ఎఫెక్ట్ పడుతుందంటున్న సైకాలజిస్టులు

‘బంటిగాడు చికెన్​ కావాలని ఏడుపు మొదలుపెట్టిండు. అమ్మ దగ్గరకు వచ్చి అడిగిండు. వద్దని చెప్పిందామె. బంటిగాడి కండ్ల నిండా నీళ్లు తిరిగినయ్.  ‘పప్పకు చెప్తా.. నాకు చికెన్​ పెడతావా? పెట్టవా?’  బెదిరించిండు బుడ్డోడు.   వచ్చిరాని భాషలో ఆ మాటలు ముద్దుగా అనిపించినయ్ తల్లికి. వీడియో తీసి, సోషల్​ మీడియాలో పెట్టిందామె.  తల్లిని ఆకట్టుకున్నట్టే ఆ వీడియో అందరికీ సరదాగా అనిపించింది. వేల మంది చూశారు. వందల మంది షేర్లు, కామెంట్లు చేశారు. రెండ్రోజుల్లోనే ఈ వీడియో సోషల్ ​మీడియాలో  వైరల్ అయింది. తల్లికి భలే  అనిపించింది. అప్పటి నుంచి బంటిగాడికి కొత్త డ్రెస్సులు, వాడి కొత్త చేష్టలు అన్నింటినీ  సోషల్​ మీడియాలో పెట్టేది. కొన్ని రోజులకే బంటిగాడి పేరుతో స్పెషల్​ సోషల్​ మీడియా అకౌంట్లు ఓపెన్​ చేసింది. 3 నెలల్లో బుడ్డోడికి 50 వేలమంది ఫాలోవర్లు పెరిగిన్రు.  రోజుకో ఇన్​స్టా రీల్,  వారానికో కమర్షియల్​ ప్రమోషన్​ వీడియో కామన్​అయ్యింది. ఇట్లా సోషల్​ మీడియాలో బంటిని బిజీ చేయడంలో తల్లి కూడా బిజీ అయింది. కానీ ఇలా చిన్నారులతో వీడియోలు చేయించే పేరెంట్స్ వారి పిల్లల ఫ్యూచర్ , బ్రెయిన్​పై పడే ఎఫెక్ట్​గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్టులు చెప్తున్నరు.

హైదరాబాద్, వెలుగు: ఇది కేవలం బంటి స్టోరీనే కాదు.. ఈమధ్య చాలామంది పేరెంట్స్​ తమ పిల్లల్ని సోషల్​ మీడియా వైపు తీసుకొస్తున్నారు.  తమ పిల్లల ఫన్నీ వీడియోలు వైరల్​ అవ్వాలని  తాపత్రయపడుతున్నారు.   ఐదారేండ్ల లోపు పిల్లలకు పేరెంట్సే సోషల్ మీడియాలో అకౌంట్లు, పేజ్ లు క్రియేట్ చేస్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్న పాటలకు డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లు, డైలాగ్స్ ని చిన్నారులతో చెప్పిస్తూ వీడియోలు షూట్ చేస్తున్నారు. వాటిని సోషల్ అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు.  చూడ్డానికి వీడియోలు బాగానే ఉన్నా.. భవిష్యత్తు బాధగా మారుతుందని  సైకాలజిస్టులు   హెచ్చరిస్తున్నారు. ఫేమ్ కోసం తెలిసీ తెలియని వయసులో పిల్లలతో ఇలా వీడియోలు చేయించడం వల్ల వాళ్ల ఆలోచనలు తప్పుదారిపట్టే ప్రమాదముందని చెప్తున్నారు. 

చిన్న వయసులో పెద్దవాళ్లలా..

మూవీస్​లో హిట్టయిన  ఐటమ్ సాంగ్స్ పెట్టి పిల్లలతో పేరెంట్స్ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయిస్తున్నారు.   సాంగ్స్ కి మీనింగ్ తెలియని పిల్లలు మూవీలో ఉన్నట్లుగానే ఎక్స్ ప్రెషన్స్ పెడుతున్నారు. ఇలాంటి వీడియోలకు లైక్ లు, షేర్లు, కామెంట్లు ఎక్కువగా వస్తుండటంతో చాలామంది పేరెంట్స్ దాన్నే ఫాలో అవుతున్నారు. అలా వీడియోలు సోషల్ అకౌంట్స్ లో పోస్ట్ చేసి ఫేమస్ అవుతున్నామని సంబురపడుతున్నారు.   సోషల్  మీడియాలో  ఎక్కువ ఫాలోవర్లు ఉన్న పిల్లలతో కమర్షియల్​ ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు.  ఫేమ్ తో పాటు పైసలు కూడా వస్తుండటంతో పేరెంట్స్ మరింతగా వీటిలో మునిగిపోతున్నారు. కానీ దీనివల్ల పిల్లల భవిష్యత్ పై చెడు ప్రభావం పడుతుందనే ఆలోచన మర్చిపోతున్నారని డాక్టర్లు అంటున్నారు. వయసుకి మించిన కంటెంట్ తో వీడియోలు చేయించడం, వాటిని పేరెంట్స్ వారి సరదా కోసం పోస్ట్ చేస్తుండటంద్వారా రియల్ లైఫ్ లో కూడా పిల్లలు అలా ప్రవర్తించే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు.

ఆలోచన తప్పుదారి పడుతుంది..

నాలుగు రోజుల క్రితం ఓ మహిళ  ఏడేళ్ల కొడుకుని తీసుకొచ్చింది. పిల్లాడు స్టడీస్ పై కాన్సంట్రేట్ చేయట్లేదని, గేమ్స్ కి అడిక్ట్ అయ్యాడని చెప్పారు. నేను ఆ బాబుతో మాట్లాడుతూ నువ్వు గ్రౌండ్ కి వెళ్లి ఏమేం చేస్తుంటావ్ అని అడిగా. అందుకు ఆ అబ్బాయి ‘దట్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు టెల్’ అన్నాడు. అంటే డబుల్ మీనింగ్​లో తను నాకు ఆన్సర్ ఇచ్చాడు. పేరెంట్స్ దీన్ని కంట్రోల్ చేయాలి. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే దానిపై దృష్టి పెట్టాలి. కానీ చాలామంది పేరెంట్స్ అది పట్టించుకోకుండా వాళ్లే పిల్లలతో పెద్దవాళ్లలాగా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెషన్స్ పెట్టించి, డైలాగ్స్ చెప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువవుతోంది.  దీనివల్ల 
భవిష్యత్​లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

-  అనిత ఆరే, సైక్రియాట్రిస్ట్