చిన్నారులకు ఆన్ లైన్  క్లాసులు..పేరెంట్స్ కు తప్పని తిప్పలు

చిన్నారులకు ఆన్ లైన్  క్లాసులు..పేరెంట్స్ కు తప్పని తిప్పలు


బేస్మెంట్ గట్టిగా ఉంటేనే బిల్డింగ్ బాగుంటుంది. ప్రైమరీలో మంచి పట్టు సాధిస్తేనే... భవిష్యత్ చదువు పక్కగా ఉంటుంది. అంతేకాదు అక్షరాలు అంకెలు మెదడులో బలంగా నాటుకుంటాయి. కరోనా వైరస్ తో చిన్నారుల చదువుల పునాదులపై దెబ్బపడింది. గతేడాది కాలంగా చిన్నారులకు ఆన్ లైన్ క్లాసులంటూ సరిగ్గా సాగటం లేదు. దీంతో పెరెంట్స్ పడుతున్న తిప్పలు అంతా ఇంతా కాదు.

చిన్నారుల చదువులను కరోనా ఆగం చేసింది. గతేడంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ సెకెండ్ క్లాసులకు ఆన్ లైన్ లో కానీ.. ఆఫ్ లైన్ లో కానీ బోధన జరగలేదు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్ధలు మాత్రం నర్సరీలో అడ్మిషన్లు లేకపోవటంతో.. LKG, UKG, ఫస్ట్, సెకండ్ తరగతులకు ఆన్ లైన్ బోధన పేరుతో.. ప్రతిరోజూ పేరెంట్స్ వాట్సప్ లకు వర్క్ షీట్లు పంపించి.. వాటిని పూర్తిచేసి తిరిగి పంపేలా ఏర్పాట్లు చేశారు. సేమ్ సీన్ ఈ ఏడాది కూడా రిపీట్ అవుతోంది. దానికి తగ్గట్లుగానే పేరెంట్స్ నుంచి భారీగానే ఫీజులు వసూలు చేస్తున్నారు.

పక్కన పేరెంట్స్ ఉంటేనే ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు చిన్నారులు. లేదంటే గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. వాళ్ల హోమ్ వర్క్ కూడా పేరెంట్స్ దగ్గరుండి చేయిస్తేనే చేస్తున్నారు. ఎంత ఇంట్రస్ట్ గా విన్నా ఆన్ లైన్ క్లాసులు చిన్నారులకు అంతగా అర్ధం కావటంలేదు. అంతకుముందు వచ్చిన అక్షరాలు, అంకెలు కూడా మర్చిపోతున్నారు. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన పద్ధతి వేరు.. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఆన్ లైన్ చదువులు వేరంటున్నారు విద్యావేత్తలు. ఇంట్లో ఎడ్యుకేటెడ్ పెరెంట్స్ ఉంటే అంతో ఇంతో పిల్లలను కుర్చుబెట్టి చెబుతున్నారే తప్ప.. పెద్దగా చదువుకోని పెరెంట్స్ కు.. ఈ ఆన్ లైన్ క్లాసులు మరింత కష్టంగా మారాయంటున్నారు.
స్కూల్స్ లో ఆరు గంటల సమయం.. పిల్లలను బుజ్జగించి, ఆడించి పాఠాలు చెప్పేవారు. పిల్లలు కూడా టీచర్ల భయంతో చదివేవారు. కానీ ప్రస్తుతం నర్సరీ పిల్లలకు 45 నిముషాలు, LKG, UKG స్టూడెంట్స్ కు 2గంటలు.. ఫస్ట్, సెకండ్ క్లాసులకు 3 గంటల సమయం ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. మిగతా సమయంలో ఫోన్ ఆడుతూ.. టీవీలు చూస్తూ గడిపేస్తున్నారని పేరెంట్స్ వాపోతున్నారు. ఆన్ లైన్ క్లాసులు అర్ధం కాకపోయినా.. వేలకు వేలు ఫీజులు కట్టడం తప్పటం లేదంటున్నారు. టీచర్లు చెప్పింది రాయటం తప్ప.. అర్ధం చేసుకోవడంలో చిన్నారులు వెనుకపడటంతో.. ట్యూషన్లకు పంపుతున్నామని చెబుతున్నారు.

కరోనా టైమ్ లో ఆన్ లైన్ విద్యావిధానాన్ని ప్రోత్సహించటం తప్ప.. చేసేదేమీ లేదన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కానీ కేవలం ఫీజులు వసూలు చేయటం.. పైతరగతులకు ప్రమోట్ చేయటం తప్ప.. ఈ ఆన్ లైన్ క్లాసులతో ప్రీప్రైమరీ చిన్నారులకు.. విద్యాబోధన అందటం లేదంటున్నారు పేరెంట్స్ ఆసోసియేషన్ సభ్యులు. చిన్నారులకు బేసిక్ ఫౌండేషన్ దెబ్బతింటుందని అంటున్నారు. విద్య అందకపోయినా ప్రమోట్ చేసుకుంటుపోతే.. బేసిక్స్ రాకుండా రానున్న రోజుల్లో చిన్నారులు ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. ప్రభుత్వం చిన్నారుల ఆన్ లైన్ క్లాసుల విషయంలో.. జీరో అకాడమిక్ ఇయర్ చేసేలా ఆలోచన చేయాలంటున్నారు.

 గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులు కనీసం పుస్తకాలు ముట్టకుండా.. అక్షరం ఒంటపట్టకుండానే పైతరగతులకు ప్రమోట్ అయ్యారు. ప్రైవేటులోనూ విద్యార్ధుల చదువులు అంతంతమాత్రంగానే మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ ఆన్ లైన్ క్లాసులే నిర్వహిస్తున్నారు. ఇక రానురాను చదువంటే ఆసక్తి తగ్గి.. చిన్నారుల భవిష్యత్ పై తీవ్రప్రభావం చూపుతుందన్న ఆందోళన పెరెంట్స్ లో వ్యక్తమౌతోంది.