స్కూళ్లు మూణ్నెళ్లే ఉన్నా..జాయిన్ చేస్తున్నరు

స్కూళ్లు మూణ్నెళ్లే  ఉన్నా..జాయిన్ చేస్తున్నరు
  • ఎంతో కొంత నేర్చుకుంటారనే ఆలోచనలో పేరెంట్స్
  • లెర్నింగ్​ గ్యాప్ పోగొట్టేందుకు ప్రయత్నం
  • ప్రీ, ప్రైమరీ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఆగమైన పిల్లల చదువులను గాడిలో పెట్టేందుకు పేరెంట్స్​ప్రయత్నిస్తున్నారు. అప్పర్​ ప్రైమరీ స్టూడెంట్స్ అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లారు. లేదంటే ఆన్​లైన్​క్లాసులకు అటెండ్​ అయ్యారు. కానీ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్టూడెంట్స్​ మాత్రం క్లాస్ రూమ్స్​ ముఖమే చూడలేదు. కరోనా వేవ్స్​వరుస పెట్టడంతో చాలా మంది తల్లిదండ్రులు భయంతో పిల్లలను ఇంటికే పరిమితం చేశారు. కొందరు ధైర్యం చేసి జాయిన్​చేసినా కొద్ది రోజులకే బంద్​ చేయించారు. ఇలా రెండేళ్లుగా ఇంట్లోనే ఏబీసీడీలు, నంబర్స్, రైమ్స్​నేర్పించారు. ప్రస్తుతం థర్డ్​వేవ్ ​ప్రభావం తగ్గిపోయిందని రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించడంతో చిన్నారులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు రెడీ అవుతున్నారు. అకడమిక్​ఇయర్​ఇంకో మూడు నెలలే ఉన్నప్పటికీ ఎంతో కొంత నేర్చుకుంటారని ఆలోచిస్తున్నారు. దగ్గరలోని స్కూళ్లకు కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. మంచిగా ఉందని అనిపిస్తే వెంటనే జాయిన్​చేసేస్తున్నారు.

నేరుగా యూకేజీ, ఫస్ట్​ క్లాస్
కొవిడ్ ఎంటర్ కాకముందు నర్సరీలో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు ప్రస్తుతం యూకేజీకి వచ్చేశారు. కానీ రెండేళ్లలో వాళ్లు స్కూలుకి పోయింది లేదు. క్లాసులు విన్నదీ లేదు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పిల్లలకు ఆన్​లైన్ ​క్లాసులు చెప్పినప్పటికీ అంతగా రీచ్ ​కాలేదు. ప్రస్తుతం కరోనా టెన్షన్ తగ్గడంతో తల్లిదండ్రులు మంచి స్కూళ్ల సెర్చింగ్​లో పడ్డారు. రెండేళ్ల లెర్నింగ్ గ్యాప్ ని పోగొట్టేందుకు ఎంక్వైరీ చేస్తున్నారు. న్యూ అడ్మిషన్ తీసుకుని నేరుగా యూకేజీ, ఫస్ట్ క్లాసులో చేర్పించేస్తున్నారు. మాములుగా అడ్మిషన్లు ఓపెన్  చేయగానే రోజుకి రెండు, మూడు ఎంక్వైరీ కాల్స్ వచ్చేవని, ప్రస్తుత అకడమిక్​ఇయర్​కు ఇంకో మూడు నెలలే టైం ఉన్నా కొత్త అడ్మిషన్ల కోసం పేరెంట్స్​ఎక్కువగా కాల్​చేస్తున్నారని మేనేజ్​మెంట్లు చెబుతున్నాయి. ‘రెండేళ్ల కింద మా బాబు/పాపను నర్సరీలో జాయిన్ చేశాం. కరోనా భయంతో ఇన్నాళ్లు ఇంట్లోనే ఉంచి బేసిక్స్ నేర్పించాం. ఇప్పుడు యూకేజీలో సీటు కావాలి. మళ్లీ ఫండమెంటల్స్ నుంచి నేర్పిస్తారా?’ అని అడుగుతున్నారని అంటున్నాయి. రెండేళ్లు గ్యాప్ ​రావడంతో ఉన్న మూడు నెలలను వేస్ట్​చేయడం ఎందుకు అనే ఆలోచనలో పేరెంట్స్​ఉన్నారు. దాదాపు 70 శాతం మంది పేరెంట్స్ పిల్లలను స్కూళ్లకు పంపించేదుకు ఇంట్రస్ట్​గా ఉన్నారు. 

మొన్ననే జాయిన్ ​చేసినం
మా బాబుకి మూడేళ్లు. గతేడాది ఓ ప్రీ ప్రైమరీ స్కూల్​లో అడ్మిషన్ తీసుకున్నాం. కొద్దిరోజులకే కొవిడ్​ కేసులు పెరగడంతో మాన్పించేశాం. నేనే ఇంట్లో ఆల్ఫాబెట్స్, వర్డ్స్ నేర్పించా. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో 4 రోజుల కింద మా ఇంటికి దగ్గర్లోని స్కూల్ లో జాయిన్ చేశాం. యూకేజీలో అడ్మిషన్ తీసుకున్నాం. 
- సోనీ ప్రియ, పేరెంట్, ఓయూ కాలనీ