ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీబీ చైర్మన్.. పరిగి టీఆర్ఎస్లో వర్గపోరు

ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీబీ చైర్మన్.. పరిగి టీఆర్ఎస్లో వర్గపోరు

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. డీసీసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ మనోహర్ రెడ్డి వర్గీయుల మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. మనోహర్ రెడ్డి వెంట ఎలా వెళ్తారంటూ ఓ టీఆర్ఎస్ కార్యకర్తతో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో వైరల్ గా మారింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ను ఆశించి భంగపడ్డ మనోహర్ రెడ్డి .. ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ గా నియమితులయ్యారు.  ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులతో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

ఇన్నాళ్లు కుల్కచర్ల మండల కేంద్రానికి పరిమితమై ఉన్న మనోహర్ రెడ్డి.. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి సొంత గ్రామంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కిష్టాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కుమార్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జెడ్పీటీసీ నాగిరెడ్డి వ్యవహారశైలితో విసిగిపోయిన తాము మనోహర్ రెడ్డి వెంట వెళ్తామంటూ టీఆర్ఎస్ కార్యకర్త స్పష్టం చేశారు. ‘‘డబ్బులకు లొంగి మీరంతా మనోహర్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు. పార్టీ టికెట్ నాకే వస్తుంది. మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ?’’ అంటూ కార్యకర్తను ఎమ్మెల్యే ప్రశ్నించారు.  పార్టీ ఏదైనా మనోహర్ రెడ్డి గెలవడం ఖాయం అంటూ సమాధానమిచ్చారు.  ప్రస్తుతం ఈ ఆడియో లోకల్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది.