రాజీనామా చేయాలంటూ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి ఫోన్ కాల్

రాజీనామా చేయాలంటూ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి ఫోన్ కాల్

రాజీనామా చేస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ సామాన్య పౌరులు ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి కూడా రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్ వచ్చింది. పూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరాడు. రేగడి మామిడి పల్లి గ్రామంలో సర్పంచ్ చందాలు సేకరించి రోడ్లు వేయించాడని....ఆ దుస్థితి మనకెందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. రాజీనామా చేస్తే మునుగోడు వలే ఉప ఎన్నికలు వచ్చి పరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నాడు. అయితే తాను ప్రస్తుతం మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్నానని.... బుధవారం ఇంటికి రా..వచ్చాక రాజీనామా చేద్దామంటూ రాజుకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి  సమాధానమిచ్చాడు.

మెదక్ ఎమ్మెల్యేకు ఫోన్...
అక్టోబర్​ 29న  మెదక్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డికి రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి ఫోన్​ చేశాడు. మొదట ‘‘అక్కా.. మునుగోడులో ఏ పార్టీ గెలుస్తది’’ అని అడిగి, తర్వాత తన మనసులోని మాట బయటపెట్టాడు. ‘‘మీరు కూడా రాజీనామా చేస్తే మనకూ ఉప ఎన్నిక వస్తది.. మా కాట్రియాల విలేజ్​ కూడా డెవలప్​ అయితది కదా అక్కా’’ అనడంతోనే ఎమ్మెల్యే ఫోన్​ కట్​చేశారు. 

ఎమ్మెల్యేలకు వరుసగా ఫోన్లు...
అటు నర్సాపూర్  ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్  ఎమ్మెల్యే మాణిక్ రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజల​ నుంచి ఇలాంటి ఫోన్​కాల్సే​ వచ్చాయి. ముందుగా మునుగోడు గురించి ఆరా తీసిన కాలర్స్​.. ఆ తర్వాత మెల్లగా టాపిక్​ మార్చి, ‘‘మీరు కూడా రాజీనామా చేస్తే  మనకూ బై ఎలక్షన్​ వచ్చి, ప్రభుత్వం నుంచి ఫండ్స్​వస్తయ్​..  ఆ పైసలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు” అని సూచించారు. కొందరైతే  తమ గ్రామంలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కాస్తా డిఫరెంట్​గా స్పందించారు. ఆయనకు ఫోన్​ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేను రాజీనామా చేయమని కోరగా.. సీఎం కేసీఆర్ ను అడిగి అలాగే చేస్తానని అన్నారు. మిగిలినవారంతా మొహం మీదే ఫోన్​ కట్​చేయడంతో పాటు అసహనానికి గురయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల అనుచరులైతే ఫోన్​ చేసినవాళ్లకు కాల్​ చేసి బెదిరించడమేగాక, తిట్ల దండకం అందుకున్నారు. 

ఎందుకు రిజైన్​ చెయ్యుమంటున్నారంటే..
రాష్ట్రం చాలా నియోజకవర్గాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్​లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ డ్యామేజ్​ అయ్యాయి. బిల్లులు పెండింగ్​పెట్టడంతో టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. దీంతో గుంతల రోడ్లపై ప్రయాణం చేసేందుకు జనం నరకం చూస్తున్నారు. డ్రైనేజీలు దెబ్బతిని మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నా వాటి దిక్కు చూసినవాళ్లు లేరు. పంచాయతీ ఆఫీసులు మొదలుకొని సర్కారు స్కూళ్లు, అంగన్​వాడీ, హెల్త్​ సబ్​ సెంటర్లు.. చాలావరకు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే దిక్కులేదు. నాలుగేండ్లుగా ఇదే పరిస్థితి. కానీ ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే  అక్కడ గెలిచేందుకు స్వయంగా సీఎం కేసీఆర్​ వచ్చి, స్పెషల్​గ్రాంట్స్ పేరుతో గ్రామాలు, పట్టణాలకు వందల కోట్ల ఫండ్స్​శాంక్షన్​ చేస్తున్నారు. ఈ నిధులతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇవి కాకుండా  డబుల్​బెడ్రూం ఇండ్లను స్పీడప్​ చేయడంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా ఇండ్లకు వచ్చి కొత్త పింఛన్లు, కొత్త రేషన్​కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంరిలీఫ్​ఫండ్​లాంటివి అందజేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు కూడా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి.