నిరసనలు లేకుండా లోక్‌‌సభ..అఖిలపక్ష భేటీలో కుదిరిన ఏకాభ్రిపాయం

నిరసనలు లేకుండా లోక్‌‌సభ..అఖిలపక్ష భేటీలో కుదిరిన ఏకాభ్రిపాయం
  • స్పీకర్​ ఓం బిర్లా ప్రతిపాదనకు ప్రతిపక్షాలు ఓకే

న్యూఢిల్లీ: లోక్‌‌సభ సమావేశాలు ఇకనుంచి ఎలాంటి నిరసనలు లేకుండా కొనసాగనున్నాయి. ఈ మేరకు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంట్‌‌ వర్షాకాల సమావేశాలు  ప్రారంభమైన నాటినుంచి ప్రతిపక్షాల నిరసనలతో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. బిహార్‌‌ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌‌ఐఆర్‌‌), ఆపరేషన్​ సిందూర్‌‌‌‌పై ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఆందోళన చేస్తుండటంతో సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి.

 శుక్రవారం ఐదోరోజు కూడా ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈనేపథ్యంలో లోక్‌‌సభ స్పీకర్‌‌ ఓం బిర్లా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం  నిర్వహించారు. పార్లమెంటరీ అఫైర్స్​ మినిస్టర్​ కిరణ్‌‌ రిజిజు, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీ, ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్‌‌ నేతలు హాజరయ్యారు.  

క్వశ్చన్​ అవర్​ సమయంలో కొనసాగుతున్న నిరసనలపై ఓం బిర్లా  అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్లమెంట్​ నియమాలను పాటించాలని, సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని స్పీకర్‌‌ కోరారు. దీనికి ప్రతిపక్షాలు అంగీకరించాయి. ఈ నెల 28న ‘ఆపరేషన్‌‌ సిందూర్‌‌’పై చర్చించేందుకు కేంద్రం ఒప్పుకున్నది. దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా 
స్పందించినట్టు సమాచారం.