పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల సందడి

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల సందడి

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల సందడి షురూ అయింది. మొదటి రోజు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో నామినేషన్లు దాఖలయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులు సెలవులు ఉండటంతో ఇవాళే ( సోమవారం) కొందరు నేతలు నామినేషన్ వేశారు.

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలైంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ నామినేషన్ల స్వీకరణకు  ఏర్పాట్లు చేశారు అధికారులు.  ఈనెల 25 వరకూ అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.

కరీంనగర్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ వేశారు. పత్రాలను కలెక్టర్ కు అందజేశారు. మంత్రులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జడ్పీ చైర్మన్ తుల ఉమ కార్యక్రమానికి హాజరయ్యారు.  నామినేషన్ కు ముందు గంజ్ సర్కిల్ లోని విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేశారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రమేశ్ రాథోడ్. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. 16 సీట్లు గెలిపిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రధాని అవుతారా అన్ని ప్రశ్నించారు రామేశ్ రాథోడ్.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి రోజు నామినేషన్ వేశారు  బీఎస్పీ పార్టీ అభ్యర్థి బరిగల శివ. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందించారు.

ఇటు హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి MIM అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ వేశారు.  నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ లో అసదుద్దీన్ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.