- తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
సైఫాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో బీసీలను కులాల వారీగా లెక్కించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించారు.
ఆగస్టు 14న కేంద్రం విడుదల చేసిన జనగణన గెజిట్‌లో బీసీ కులాల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. గురువారం సైఫాబాద్‌లోని బీసీ జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలపై జరుగుతున్న కుట్రలకు నిరసనగా ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నవంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాలను లక్ష మంది బీసీలను సమీకరించి అడ్డుకుంటామని హెచ్చరించారు.
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్లా శ్రీధర్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మా, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటేపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
