
ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి ఉప్పొంగుతోంది. పంట పొలాలన్నీ మునిగిపోయి, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఆ వరద తగ్గి కేవలం బురద మాత్రం మిగిలింది. ఈ వాన వల్ల మామూలు జనాలే కాదు దేవుళ్లకూ తిప్పలు తప్పట్లేదు. మొన్నటివరకూ కురిసిన వానల కారణంగా భద్రాచలంలోని పర్ణశాల కాస్త బురదశాలగా మారింది. అటు సీతమ్మ, ఇటు లక్ష్మణుని పాదాల దగ్గర అంతా బురద పేరుకొని పోయింది. రావణాసురుడు, సీతమ్మ వారి నార చీర, రాముల వారి పాదాలు అంతా కూడా బురదతో నిండిపోయి అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. ఇదంతా శుభ్రం చెయ్యాలంటే.. నీళ్లు కావాలి. అది జరగాలంటే కరెంటు కావాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతంలో అంతటా అధికారులు కరెంటును నిలిపివేశారు. దీంతో పర్ణశాలను శుభ్రం చేయాలంటే మరింత ఆలస్యమవుతోంది.