RR vs DC: వివాదాస్పద రీతిలో శాంసన్ ఔట్.. ఢిల్లీ ఓనర్‌పై నెటిజన్ల ఆగ్రహం

RR vs DC: వివాదాస్పద రీతిలో శాంసన్ ఔట్.. ఢిల్లీ ఓనర్‌పై నెటిజన్ల ఆగ్రహం

ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (మే 8) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఔట్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16 వ ఓవర్ నాలుగో బంతికి శాంసన్ లాంగాన్ మీదుగా  షాట్ ఆడాడు. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో ఫీల్డర్ హోప్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు శాంసన్ ఔటయ్యాడు. ఈ  ఔట్ పై విమర్శల వర్షం కురుస్తుంది. 

థర్డ్ అంపైర్ చెక్ చేసినప్పుడు హోప్ బౌండరీకి తగులుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే మరో యాంగిల్ లో మాత్రం బౌండరీ రోప్ ను టచ్ చేయనట్లుగా చూపించింది. ఈ దశలో థర్డ్ అంపైర్ శాంసన్ ను ఔట్ గా ప్రకటించాడు. రీప్లేలో ఒక్కసారి మాత్రమే చూపించి ఔట్ అని నిర్ధారించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసిన శాంసన్..అంపైర్లతో వాదించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్త్ జిందాల్ రియాక్షన్ వైరల్ గా మారింది. అది "ఔట్ హై" అంటూ గట్టిగా అరిచాడు.   

ప్రస్తుతం ఇతని రియాక్షన్ సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీస్తుంది. నెటిజన్స్ ఈ ఢిల్లీ ఓనర్ పై మండిపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ సంజు శాంసన్(46 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సులు) అసాధారణంగా పోరాడినా ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ కు పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.