కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్​ ప్రకటనపై ఎదురుచూపులు

కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్​ ప్రకటనపై ఎదురుచూపులు
  • ఈరోజైనా ఫైనల్​ అయితదా!
  • ఒకేరోజు కాంగ్రెస్​ స్క్రీనింగ్, సెంట్రల్ ​ఎలక్షన్​ కమిటీల భేటీ
  • అన్నీ కుదిరితే ఎల్లుండి లిస్టు ప్రకటించే అవకాశం ఉందంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్​ ప్రకటనపై పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. దాదాపు రెండు నెలల నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న పార్టీ నేతలు.. ఇప్పటికీ తేల్చలేకపోయారు. వివిధ వర్గాల నుంచి డిమాండ్లు ఊపందుకోవడం, ఆందోళనల దాకా వెళ్లడంతో స్క్రీనింగ్ ​కమిటీ మీటింగులు నిర్వహిస్తున్నా.. నేతలు ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం చివరిసారిగా ఢిల్లీలో స్క్రీనింగ్​ కమిటీ సమావేశం కానుంది.

దాదాపు అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులపై ఓ అంచనాకు వచ్చారని తెలుస్తున్నది. అయినా, తొలి విడతలో భాగంగా 70 మందితో అభ్యర్థులను ప్రకటిస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతున్నది. శుక్రవారం జరిగే స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​లో జాబితాపై చర్చించి సెంట్రల్ ​ఎలక్షన్​ కమిటీకి లిస్టును అందించనున్నారు. ఆ లిస్టును పరిశీలించేందుకు శుక్రవారం సాయంత్రమే సెంట్రల్​ఎలక్షన్​ కమిటీ మీటింగ్​ను నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయా మీటింగ్​ల  కోసం పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సహా కమిటీలోని ఇతర సభ్యులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అన్నీ ఓకే అయితే.. 15వ తేదీ లేదా ఆ తర్వాత లిస్ట్ ​ప్రకటించే చాన్స్​ ఉందని అంటున్నారు.  

ALSO READ : బీజేపీ నుంచి బరిలో సీనియర్లు..అక్టోబర్ 16 తర్వాత ఫస్ట్ లిస్ట్

జానారెడ్డితో భేటీ..

స్క్రీనింగ్​ కమిటీ, సెంట్రల్ ​ఎలక్షన్ ​కమిటీ మీటింగ్​లు వరుసగా ఉండటంతో గురువారం బుజ్జ గింపుల కమిటీ సభ్యులైన జానా రెడ్డితో పీసీసీ చీఫ్ ​రేవంత్​ రెడ్డి, మాణిక్ ​రార్​ ఠాక్రే సమావేశమ య్యారు. జూబ్లీహిల్స్​లోని జానారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీలోని సభ్యులైన దీపాదాస్​ మున్షి, మీనాక్షి నటరాజన్​ హాజరయ్యారు. 70 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓ క్లారిటీ రాగా.. మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తుల పరిస్థితేంటన్న దానిపై జానారెడ్డితో రేవంత్​, ఇతర నేతలు చర్చించినట్టు తెలిసింది. లిస్ట్​ ప్రకటించే సాధ్యాసాధ్యాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది.