పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్​ ట్రాన్స్ఫర్​ అంశం వివాదాస్పదం

పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్​ ట్రాన్స్ఫర్​ అంశం వివాదాస్పదం

హనుమకొండ, వెలుగు: ల్యాండ్ పూలింగ్​ జీవోను రద్దు చేయాలనే డిమాండ్​తో ఎమ్మెల్యే వెహికిల్​ను అడ్డుకున్న రైతులను చితకబాదినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్​ ట్రాన్స్​ఫర్​ అంశం వివాదాస్పదమైంది. విశ్వేశ్వర్​ను మొదట వీఆర్​కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి.. గంట వ్యవధిలోనే కొత్తగా ఏర్పాటవుతున్న ఏనుమాముల పీఎస్​​ కు ఇన్​ స్పెక్టర్​గా నియమించడం విమర్శలకు తావిచ్చింది. సీఐ ట్రాన్స్​ఫర్​ విషయంలో సీపీ డా.తరుణ్​ జోషి వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.

సీపీకి ఫిర్యాదు చేసినా..
ల్యాండ్​ పూలింగ్​ జీవోను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ మే 31న పెరుమాండ్లగూడెంలో ఎమ్మెల్యే రమేశ్​ను పలువురు రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో శ్రీనివాస్, నిరంజన్, మురళి అనే రైతులను తెల్లవారుజామున స్టేషన్​కు తీసుకెళ్లి చితకబాదడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారు సీఐ విశ్వేశ్వర్, ఎస్సై భరత్​ పై సీపీకి ఫిర్యాదు చేశారు. అయినా యాక్షన్​ తీసుకోకపోవడంతో సీపీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఐ విశ్వేశ్వర్​ను వీఆర్​కు బదిలీ చేస్తూ మొదట ఉత్తర్వులు ఇచ్చారు. అయితే గంటలోనే అతనిని ఏనుమాముల స్టేషన్​కు సీఐగా పోస్టింగ్​ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ బదిలీ వెనుక రాజకీయ కారణాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను అక్రమంగా స్టేషన్​కు తీసుకెళ్లి చితకబాదిన సీఐకి సీపీ పనిష్మెంట్​ ఇస్తాడని భావిస్తే.. ప్రమోషన్​ ను తలపించే పోస్టింగ్​ ఇచ్చి వెనుకేసుకు రావడమేమిటని రైతులు, ప్రజా సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, కమిషనరేట్​ పరిధిలో విశ్వేశ్వర్​ తో పాటు ఇంకో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఒంటేరు రమేశ్​ను సీఎస్​బీ నుంచి ధర్మసాగర్​కు, అక్కడి సీఐ బొల్లం రమేశ్ ​ను వీఆర్​కు ట్రాన్స్​ ఫర్​ చేశారు. వీఆర్​లో ఉన్న అనుముల శ్రీనివాస్​ కు పర్వతగిరి సీఐగా పోస్టింగ్​ ఇచ్చారు.