నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్​ఎస్​ పార్టీని ఓడగొట్టాలె : పాశం యాదగిరి

నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్​ఎస్​ పార్టీని ఓడగొట్టాలె : పాశం యాదగిరి

ఖమ్మం టౌన్, వెలుగు : నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ.. నిరుద్యోగుల ఆత్మహత్యలకు నిలయమైందని ప్రొఫెసర్​హరగోపాల్​ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఒయాసిస్ ఫంక్షన్ హాల్​తో పాటు కొత్తగూడెంలోని శేషగిరిభవన్​లో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దేవిరెడ్డి విజయ్ అధ్య క్షతన ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మన కర్తవ్యాలు’ అంశంపై సదస్సులు నిర్వహించారు. 

దీనికి హరగోపాల్ తో పాటుగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ 1200 మంది ఉద్యమ కారుల బలిదానాలతో రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్​ ఒక్కడి ఖాతాలోనే వేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సీఎం సరెండరయ్యారన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. దీనికి కారణమైన బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. 

ప్రభుత్వాలు ప్రజ ల భూములను అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్​అన్నీ తానై వ్యవహరించడం వల్లే కాళేశ్వరం రూపంలో భారీ ఆర్థిక నష్టం జరిగిందని,  అందుకే ఏ ఒక్క మీటింగ్​లోనూ మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులపాలు చేసిండన్నారు. సింగూరులో నీళ్లు లేవని అక్కడి ప్రజలు హరీశ్​రావును అడిగితే కాళేశ్వరం నుంచి వస్తాయని చెప్తున్నారన్నారు. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు పోతున్నాయన్నారు. ధరణి వల్ల పట్టా భూములన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ధరణి వల్ల సీలింగ్ భూములన్నీ పార్ట్ బిలోకి వెళ్లిపోయాయని, కౌలు చట్టాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. 

నిక్కర్, లిక్కర్ పార్టీలు రెండు ఒకటేనని చెప్పారు. రేపు కాంగ్రెస్ నుంచి గెలిచినోళ్లు అమ్ముడు పోతే పౌర సమాజం బడితతో కొడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ప్రశ్నిస్తామన్నారు. ఖమ్మంలో కొండల్ రెడ్డి, కరుణాకర్ దేశాయ్,రవిచంద్ర, డాక్టర్ వనమాల, సీసీఏ లీడర్లు ఐవి రమణారావు, కాకి భాస్కర్, డాక్టర్ కేవీ.కృష్ణారావు, గుంతేటి వీరభద్రం, న్యూడెమోక్రసీ లీడర్లు రాజేంద్రప్రసాద్, గిరి, టీపీఏఏసీ లీడర్లు విశ్వ, నరేందర్, రమేశ్, దాసరి శ్రీను, వి.విజయ్ కుమార్, పూర్ణ చందర్ పాల్గొనగా, కొత్తగూడెంలో స్టేట్​ కో కన్వీనర్లు​అంబటి నాగయ్య, కె. రవిచంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కె. సాబీర్​పాషా, ప్రముఖ న్యాయవాది రమేశ్​కుమార్​మక్కడ్​, టీజేఏసీ రాష్ట్ర నాయకులు మల్లెల రామనాథం, నాయకులు ఎట్టి ప్రశాంత్​, ఉదయ్​ భాస్కర్​ పాల్గొన్నారు.