అండర్ బ్రిడ్జీలు అస్తవ్యస్తం.. వాన నీరు చేరి నిలిచిపోతున్న రాకపోకలు

అండర్ బ్రిడ్జీలు అస్తవ్యస్తం.. వాన నీరు చేరి నిలిచిపోతున్న రాకపోకలు
  • ప్రయాణికుల అవస్థలు ..కొన్ని చోట్ల ప్రమాదాలు
  • పట్టించుకోని అధికార యంత్రాంగం 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​జిల్లాలో జాతీయ రహదారి 44పై నిర్మించిన అండర్‌ బ్రిడ్జీలు అస్తవ్యస్తంగా మారాయి. నిర్వహణ లేక పాడైపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జనథ్ మండలం మహారాష్ట్ర సరిహద్దు పెన్ గంగా నుంచి మొదలు కొని నేరడిగొండ వరకు విస్తరించిన ఈ జాతీయ రహదారిపై ఉన్న  అండర్ బ్రిడ్జీలన్నీ పాడైపోయాయి. రోడ్డు నిర్మాణం చేపట్టిన సంస్థ 15 ఏళ్ల పాటు రోడ్డు, బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్ల బాధ్యతలు చూసుకోవాల్సి ఉండగా బ్రిడ్జీల నిర్వహణ గాలికొదిలేసింది. దీంతో ఆ బ్రిడ్జీల కింద వర్షం నీరు నిలిచిపోతోంది. కొన్ని చోట్ల గుంతలు ఉండి, వాటిలో నీరు చేరడంతో అందులో నుంచి వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం పడితే బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున నీరు నిలిచి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్​ఏర్పడుతోంది. 

ఆది నుంచి లోపాలే..

44వ జాతీయ రహదారి నిర్మాణంలో ఆది నుంచి లోపాలే కనిపిస్తున్నాయి. జాతీయ రహదారి భద్రత, నిర్వహణ, రక్షణ చర్యల విషయంలో నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిని ఆనుకుని ఉన్న నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, మావల, ఆదిలాబాద్‌ రూరల్‌, జైనథ్‌ మండలాల పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  మొదట్లో బోరజ్, జందాపూర్, గుడిహత్నూర్ వద్ద సరైన సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ఎన్నో ప్రమాదాలు జరిగి, చాలా మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అధికార యంత్రాంగం నిద్రలేచి చర్యలు తీసుకుంది.

రైల్వే అండర్ బ్రిడ్జీలది అదే పరిస్థితి

జిల్లాలో రైల్వే లైన్ కింద నిర్మించిన అండర్ రైల్వే బ్రిడ్జీల పరిస్థితి సైతం అలాగే ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గణేశ్ మందిర్ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జిలో చిన్నపాటి వర్షానికి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అటు గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జిలు సైతం వర్షం నీటితో నిండిపోతున్నాయి. తలమడుగు మండలం ఖోడద్, జైనథ్ మండలం గిమ్మ, బోరజ్ గ్రామ సమీపంలో నిర్మించిన బ్రిడ్జి పరిస్థితీ అంతే. చాలా చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జీల కారణంగా గ్రామాలకు, పొలాలకు వెళ్లేందుకు రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా వీటికి రిపేర్లు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.