ప్రయాణికులే టార్గెట్​గా చైన్​ స్నాచింగ్.

ప్రయాణికులే టార్గెట్​గా చైన్​ స్నాచింగ్.
  • ప్రయాణికులే టార్గెట్​గా చైన్​ స్నాచింగ్.
  • రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న మాదాపూర్​పోలీసులు
  • 93 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం.. 9 మంది నిందితుల అరెస్ట్

మాదాపూర్, వెలుగు:  హైటెక్​సిటీలో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో చైన్​స్నాచింగ్​కు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్​పోలీసులు పట్టుకున్నారు. 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్​చేసి, రూ.6 లక్షల విలువైన 93 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్​ డీసీపీ శిల్పవల్లి ఏడీసీపీ నర్సింహారెడ్డితో కలిసి గురువారం మాదాపూర్​పీఎస్​లో వివరాలు వెల్లడించారు. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన నగేశ్, ధర్మేందర్, అనిల్, రాహుల్, హీరా, ప్రసాద్​, లక్ష్మణ్, శ్రీనివాస్, రమేశ్​ మల్లేపల్లి అఫ్జల్​సాగర్​కాలనీలో నివాసముంటూ కూలీ పనులు చేస్తున్నారు. డబ్బులు సరిపోకపోవడం, లగ్జరీ లైఫ్​ను గడపాలని కోరిక ఉండడంతో అందరూ కలిసి చైన్​స్నాచింగ్ లకు పాల్పడాలని డిసైడ్​అయ్యారు. జూబ్లీహిల్స్–సైబర్​టవర్స్​రోడ్, మెహిదీపట్నం–లింగంపల్లి రూట్, కూకట్​పల్లి రూట్​లలో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మగవారి మెడలోని చైన్​లు కొట్టేసేందుకు ప్లాన్​వేశారు. 

బస్సులో తోపులాట సృష్టించి చోరీలు

10 నుంచి 15 మంది వరకు ఒక బ్యాచ్​గా ఏర్పడి ఒకే బస్సు ఎక్కి బంగారు గొలుసు ధరించిన వ్యక్తిని టార్గెట్​ చేసుకునేవారు. ప్రయాణికుడు బస్టాప్​లో దిగే సమయంలో ఫుట్​బోర్డు వద్ద తోపులాట చేస్తున్నట్లు చేసి అతడి మెడలోని చైన్​ను ఒకరు కట్​చేసి వెంటనే మరొకరికి ఇచ్చేవారు. ఆ చైన్​తీసుకున్న వ్యక్తి వెంటనే బస్సు దిగి జారుకునేవాడు. ఆ ముఠా లీడర్​నగేశ్​ఆ చైన్​ను అమ్మేసి వచ్చిన డబ్బును మిగిలిన వ్యక్తులకు తలా 1000, 2000 వేలు ఇచ్చేసి మిగతా డబ్బును తన వద్ద ఉంచుకునేవాడు. వీరంతా కలిసి మాదాపూర్​పీఎస్​లిమిట్స్ లో ఒక్క ఏప్రిల్​నెలలోనే 9 చైన్​స్నాచింగ్​లకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్, హుమాయున్​నగర్, రాయదుర్గం పోలీస్​స్టేషన్ల లిమిల్స్​లోనూ వీరు స్నాచింగ్​కు చేశారు.

పరారీలో మరో నలుగురు

ఆర్టీసీ బస్సుల్లో ఒక్క నెలలో 9 చైన్​స్నాచింగ్ కంప్లైంట్స్​రావడంతో మాదాపూర్​పోలీసులు ఈ కేసులపై సీరియస్​గా దృష్టిపెట్టారు. బస్టాపుల్లో కాపుకాస్తూ, బస్సుల్లో ప్రయాణికుల్లా ట్రావెల్​చేసి నిఘా పెట్టారు. గురువారం ఉదయం సీఓడీ జంక్షన్​బస్టాప్​వద్ద బస్సు ఫుట్​బోర్డుపై ఓ ప్రయాణికుడి మెడలో నుంచి లక్ష్మణ్, శ్రీనివాస్​గొలుసు స్నాచింగ్​చేస్తూ మఫ్టీలో ఉన్న పోలీసులకు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా రత్నదీప్​సూపర్​మార్కెట్​బస్టాప్​వద్ద ఉన్న మిగతా సభ్యులను అరెస్ట్​చేశారు. వీరి వద్ద నుంచి 93 గ్రాముల 9 బంగారు గొలుసులు, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు మంగీత, అర్జున్, అనురాధ, కాజల్​పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు నగేశ్​పై హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో 3 స్నాచింగ్​కేసులున్నాయి. ధర్మేందర్​పై పలు చోట్ల 10, లక్ష్మణ్​పై 13​ స్నాచింగ్​ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడినవారిని రిమాండ్​కు తరలించారు. ఈ సమావేశంలో ఏడీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రఘునందన్​రావు, ఇన్​స్పెక్టర్​ తిరుపతి, డీఐ వెంకట్ పాల్గొన్నారు.