కరోనాతో నష్టపోయాం.. ఆర్టీసీ బస్‌ పాస్‌ ల వ్యాలిడిటీ పొడిగించాలె

కరోనాతో నష్టపోయాం.. ఆర్టీసీ బస్‌ పాస్‌ ల వ్యాలిడిటీ పొడిగించాలె
  •     కరోనాతో బందైన సర్వీసులు
  •     నష్టపోయాం.. వ్యాలిడిటీ ఎక్స్‌‌టెండ్‌‌ చేయాలంటున్న పాసింజర్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: సిటీలో రోజూ లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వారిలో ఎంప్లాయీస్‌‌ ఎక్కువగా ఉంటారు. చాలా మంది నెలవారీ బస్‌‌ పాస్‌‌లు తీసుకుని ట్రావెల్‌‌ చేస్తుంటారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులను సర్కారు ఆపేసింది. తిరిగి సెప్టెంబరు 25న సర్వీసులను రీస్టార్ట్‌‌ చేసింది. దాదాపు ఆరు నెలలు సర్వీసులను ఆర్టీసీ నిలిపేయడంతో పాస్‌‌లు ఎక్స్‌‌పైర్‌‌‌‌ అయిపోయాయి. దీంతో, ఇప్పుడు ట్రావెల్‌‌ చేయాలంటే మళ్లీ ఫ్రెష్‌‌గా పాస్‌‌లు తీసుకోవాలి. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు కొందరు, ఉద్యోగాలకు వెళ్లినా జీతం అందనివారు కొందరు కాగా, సగం జీతం అందుకుంటున్న వారు మరికొందరు. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి నెలలో తీసుకున్న పాస్‌‌లు ట్రావెల్‌‌ చెయ్యకుండానే ఎక్స్‌‌పైర్‌‌‌‌ అయ్యాయని, వ్యాలిడిటీని పొడిగిస్తే బాగుంటుందని పాసింజర్లు కోరుతున్నారు.

గ్రేటర్‌‌‌‌లోనే 3.5 లక్షల పాస్‌‌లు

రాష్ట్రంలో రూట్‌‌, జనరల్‌‌, సీజన్‌‌ తదితర బస్‌‌ పాస్‌‌లను ఆర్టీసీ ఇస్తోంది. సుమారు 8 లక్షల మంది పాస్‌‌లు తీసుకుని ట్రావెల్‌‌ చేస్తారు. గ్రేటర్‌‌‌‌లోనే 3.5 లక్షల పాస్‌‌లు ఉన్నాయి. గ్రేటర్‌‌‌‌లో సిటీ ఆర్డినరీ బస్‌‌పాస్‌‌కు రూ.890, ఎక్స్‌‌ప్రెస్‌‌కు రూ.990, మెట్రో డీలక్స్‌‌కు రూ.1,500, ఏసీ బస్సులకు రూ.2వేలు చొప్పున ఆర్టీసీ వసూలు చేస్తుంది. స్టూడెంట్లకు ఇచ్చే బస్‌‌పాస్‌‌లు కూడా వివిధ రకాలుగా ఉన్నాయి. ఇటీవల బస్సు సర్వీసులకు రాష్ట్ర సర్కార్‌‌‌‌ గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇవ్వడంతో ఆర్టీసీ కూడా బస్‌‌పాస్‌‌లు జారీ చేసేందుకు రెడీ అయ్యింది. లాక్‌‌డౌన్‌‌ స్టార్ట్‌‌ అయ్యి బస్సు సర్వీసులు నిలిపివేసే సమయానికి వ్యాలిడిటీ ఉన్న పాస్‌‌ల పరిస్థితి ఏమిటి అని పాసింజర్లు ప్రశ్నిస్తున్నారు.

వ్యాలిడిటీ పొడిగించాలని విజ్ఞప్తులు..

సాధారణంగా ఆర్టీసీ బస్‌‌ పాస్‌‌ తీసుకున్న పాసింజర్‌‌‌‌ ఏ కారణంతోనైనా దానిని ఉపయోగించుకోపోతే ఆ వ్యక్తిదే బాధ్యత అవుతుంది. బస్‌‌ పాస్‌‌ వాడుకున్నా, వాడుకోకున్నా వ్యాలిడిటీ పూర్తవ్వగానే ట్రావెల్‌‌ చేయాలంటే తప్పనిసరిగా టికెట్‌‌ తీసుకోవాలి లేదా  మరో పాస్‌‌ తీసుకోవాలి. కానీ కరోనాతో ఆర్టీసీనే బస్సులను నడపలేదు. దీంతో బస్‌‌ పాస్‌‌ వ్యాలిడిటీ వృథా అయిపోయిందని పాసింజర్స్‌‌ ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీనే బస్సులు నడపలేదు కనుక పాస్‌‌ వ్యాలిడిటీని పెంచాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని  పలువురు చెబుతున్నారు. ఇదివరకు ఏదైనా కారణాలతో బస్సులు ఆగిపోతే బస్‌‌పాస్‌‌ వ్యాలిడిటీ పొడిగించేవారని రిటైర్డ్‌‌ అధికారులు చెబుతున్నారు. ‘ప్రస్తుతం బస్సులు నడవక పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయాం. నష్టాల్లో ఉన్నాం. బస్‌‌పాస్‌‌ల వ్యాలిడిటీ పొడిగించడం కష్టమే’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు.