వెలుగు ఓపెన్ పేజీ : మహిళా రిజర్వేషన్ బిల్లు వేగవంతం.. బీసీలకు మరింత అన్యాయమేనా.?

వెలుగు ఓపెన్ పేజీ :  మహిళా రిజర్వేషన్ బిల్లు వేగవంతం.. బీసీలకు మరింత అన్యాయమేనా.?

ఈ నెల 16, 17, 18  తేదీల్లో  పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక సమావేశాల్లో  మహిళా రిజర్వేషన్ బిల్లుపై  ప్రత్యేక చర్చ జరగనున్నట్లు  సమాచారం.  ‘106వ  రాజ్యాంగ  సవరణ’ ద్వారా  తెచ్చిన  నారీ శక్తి వందన అభినయం 2023  ద్వారా మహిళలకు చట్ట సభల్లో 1/3 రిజర్వేషన్  కల్పించే నిర్ణయం ఇప్పటికే  ఖాయమైంది.  ఇది  మహిళా సాధికారత దిశలో ఒక ముఖ్యమైన అడుగే.  అయినా, దాని అమలు విధానం పట్ల తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సవరణ ఆమోదించినప్పుడు  ఒక కీలకమైన షరతు ఉంది.  2027 జనగణన  అనంతరం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పూర్తయ్యాకే  ఈ  రిజర్వేషన్లు అమల్లోకి రావాలి.  అంటే, 2029 సార్వత్రిక లోక్​సభ ఎన్నికల నుంచి అమలు చేయాలన్నదే  అసలు ఉద్దేశ్యం.  

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసి, జనగణన,  డీలిమిటేషన్ లేకుండానే ముందుగానే అమలు చేయాలని భావిస్తోంది. అందుకు  రాజ్యాంగ సవరణలు చేసి తక్షణమే అమలు చేయనున్నట్లు  సమాచారం. ఈ పరిణామం ఒక మౌలిక  ప్రశ్నను లేవనెత్తుతోంది.  ఇది మహిళా సాధికారత  వేగవంతమా?  లేక  నిర్మాణాత్మక 

అసమానతలకు  వేగం పెంచడమా?
హారిజాంటల్ రిజర్వేషన్.. అసమాన పునాది 

మహిళా రిజర్వేషన్  అనేది  హారిజాంటల్ అంటే  ఇప్పటికే ఉన్న వర్గాల (ఎస్సీ,  ఎస్టీ, జనరల్) కోటాల్లోనే  1/3  భాగాన్ని  మహిళలకు కేటాయించడం.  కానీ,  భారత రాజకీయ వ్యవస్థలో ఒక స్పష్టమైన లోపం ఉంది.   ఎస్సీ, ఎస్టీలకు  ఆర్టికల్ 340,  342 ద్వారా వెర్టికల్ (నిలువు)  రిజర్వేషన్లు  ఉన్నాయి.   కానీ,  ఓబీసీలకు  చట్టసభల్లో  ఎలాంటి  వెర్టికల్  రిజర్వేషన్ లేదు.  కాబట్టి,   వారి మహిళలకు హారిజాంటల్ (సమాంతర) రిజర్వేషన్  ఉండదు. ఈ నేపథ్యంలో  మహిళా రిజర్వేషన్ అమలు అయితే.. ఎస్సీ, ఎస్టీ  మహిళలు తమ  కోటాల్లోనే  1/3 ప్రాతినిధ్యం పొందుతారు.  జనరల్ కేటగిరీలో ఆధిపత్య కులాల మహిళలు అధికంగా లాభపడతారు. ఓబీసీలకు కోటా  లేకపోవడంతో  నేతలుగా  మగవాళ్లు    నామమాత్రం  లేదా  కనుమరుగయ్యే  ప్రమాదం ఉంది.  ఓబీసీ మహిళలు  అనాథలుగానే  మిగిలిపోతారు.  

తెలంగాణ అసెంబ్లీ గణాంకాలు చెప్పే వాస్తవం

 తెలంగాణలో  అసెంబ్లీ స్థానాలు  ప్రస్తుతం ఉన్న 119 నుంచి 179 లేదా 180కు పెరిగే అవకాశాన్ని పరిగణలోకి తీసుకుంటే... ఎస్సీలకు సుమారు 27 సీట్లు, ఎస్టీలకు సుమారు 18 సీట్లు.  వీటిలోనే  మహిళా రిజర్వేషన్ అమలవుతుంది.  ఎస్సీ మహిళలు  9,  ఎస్టీ మహిళలు  6,   మొత్తం - ఎస్సీ/ఎస్టీ సీట్లు45. అందులో మహిళలు 15.  మిగిలినవి 135  జనరల్ సీట్లు.  ఇందులో 1/3 మహిళలకు 45 సీట్లు.  మిగిలినవి  90 సీట్లు (జనరల్ సీట్స్) ఈ 90లో  సుమారు 10–12 సీట్లు   ముస్లిం మైనారిటీలకు  వెళ్తాయని పరిగణిస్తే మిగిలినవి  సుమారు 80 సీట్లు.  ఇక్కడే  ఓబీసీలు పోటీ పడాల్సి వస్తుంది.  ప్రస్తుత గణాంకాల ప్రకారం.. 119లో  సుమారు 19 మంది ఓబీసీలు  (16%)  ఉన్నారు.  కానీ,   కొత్త  సమీకరణాల్లో ఓబీసీ  పురుషులు పోటీపడే స్థానాలు 80.  అంటే వీరికి సీట్లు ఏమీ పెరగవు.  ఓబీసీ పురుషులు ఇప్పుడున్న ప్రాతినిధ్యం ప్రకారం 16 నుంచి 20 ( 180–-45=135x16%)  ఓబీసీ మహిళలు 4–5  మొత్తం 20 నుంచి 25లోపు మాత్రమే (180లో) అంటే 12% నుంచి 14% మధ్యలోనే ఓబీసీ ప్రాతినిధ్యం ఉండే ప్రమాదం ఉంది.   ప్రస్తుత లోక్​సభలో  17 మంది  సభ్యులు  తెలంగాణ  నుంచి ఉండగా  అందులో ఆరుగురు రెడ్డిలు,  ఒక  వెలమ,  ఒక మైనారిటీ,  ఎస్సీలు ముగ్గురు,  ఎస్సీలు  ఇద్దరు,  బీసీలు  నలుగురు  ఉన్నారు.  ఈ  మహిళా  రిజర్వేషన్లు  అమల్లోకి వస్తే  పార్లమెంట్ సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17 నుంచి 25-– 26 వరకు పెరగవచ్చు.  కానీ,  బీసీలకు  ఎటువంటి లాభం జరగదు.  ప్రస్తుత  లోక్​సభలో  ఓబీసీలు 138 మంది అంటే  25.4% ఉన్నారు.  కానీ,  ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే  కచ్చితంగా ఈ శాతం తగ్గుతుంది. అందుకు ఉదాహరణ  తెలంగాణ అసెంబ్లీ గణాంకాలు.   ఓబీసీలలో  కూడా ఉప వర్గీకరణ చేసి అత్యంత  వెనుకబడిన వర్గాలకు అందులోని వారి  మహిళలకు కూడా రిజర్వేషన్  కల్పించాలి.  అప్పుడే  సామాజిక న్యాయం అందరికీ  అందుతుంది.

చరిత్ర ఏమి చెబుతోంది?

ఈ సమస్యను ముందుగానే గుర్తించిన నాయకులు  కాన్షీరాం,   ములాయం సింగ్ యాదవ్,  లాలూ ప్రసాద్ యాదవ్.   వీరు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు.  కానీ ‘ఓబీసీ కోటా లేకుండా మహిళా రిజర్వేషన్  అమలుచేస్తే  అది అగ్రవర్ణాలకే లాభం చేకూరుస్తుంది’ అని స్పష్టంగా హెచ్చరించారు. మరి ఇప్పుడు అదే నిజం కాబోతుంది.  పార్లమెంటులో అనేక సందర్భాలలో బిల్లులను పెట్టినప్పుడు కూడా పాస్ కాలేదు. కానీ,  బీజేపీ ప్రభుత్వం తనకున్న 
మెజారిటీతో   పాస్  చేస్తోంది.  ‘నస్త్రి స్వాతంత్ర మర్హతే’ అంటే  స్త్రీకి స్వేచ్ఛ అవసరం లేదు అన్న మనుధర్మ శాస్త్రం నానుడి  నుంచి భారత రాజ్యాంగం మహిళలకు 1/3  రిజర్వేషన్లు  కల్పించడం ఒక గొప్ప చారిత్రక, సామాజిక  న్యాయ ప్రక్రియ.  పురోగమన  ప్రగతిశీల చర్య.  ఈ దేశంలో  మహిళలు  రెండు రకాల వివక్షత ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఒకటి  లింగ వివక్షత, రెందోది  కులవివక్షత.  అందుకే  మహిళా రిజర్వేషన్లు అవసరమే.  వారిప్పుడు  భారత  ప్రజాస్వామ్య  చరిత్రను  తిరగ రాయబోతున్నారు.  అందులో  జనాభాలోని 25%  ఓబీసీ మహిళలకు  రిజర్వేషన్స్  లేకపోవడం శోచనీయం.   కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం  డేటా లేకుండా,  కుల అసమానతలను పట్టించుకోకుండా,  ఓబీసీల  గోడు  వినకుండా  అమలు చేస్తే  అది మహిళా  సాధికారత కాదు. 

వేగవంతమైన అమలుకు తొందర ఎందుకు? 

మొదట నిర్ణయించినట్టుగా... జనగణన, డీలిమిటేషన్  పూర్తయ్యాక అమలుచేస్తే  కనీసం  ప్రాతినిధ్యాన్ని  సమీక్షించే  అవకాశం  ఉండేది.  ఓబీసీలకు  కూడా  చట్టసభలలో  రిజర్వేషన్లు  కల్పించే  అవకాశం ఉండేది.  కానీ,  ఇప్పుడు  డేటా లేకుండా,  నిర్మాణాత్మక  అసమానతలను  సరిచేయకుండా అమలుచేస్తే అది వ్యవస్థాత్మక తప్పు.  బీజేపీ  ఉద్దేశపూరకంగా  ఓబీసీ  రిజర్వేషన్లకు  గండి కొట్టాలనే  మహిళా రేజర్వేషన్లను  ముందుకు తీసుకువచ్చిందని బీసీ సంఘాలు  అభిప్రాయపడుతున్నాయి.  జనగణనలో  కులగణన జరిగితే  బీసీ రిజర్వేషన్స్ ఉద్యమం  దేశవ్యాప్తంగా ఉధృతమవుతుందనే  సమాచారంతో  ముందుగానే   కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది  అని  బీసీ  ప్రజలు సందేహాలు వెలిబుచ్చుతున్నారు.  ఇప్పటికే  బీజేపీ 

ప్రభుత్వం అడగకుండానే 10%  ఈడబ్ల్యూఎస్  రిజర్వే

షన్ అగ్ర కులాలకు  తీసుకువచ్చి బీసీలను  దెబ్బకొట్టింది  అలాగే  ఈ  రిజర్వేషన్ల వలన  అగ్రకుల మహిళలకు లాభం తప్ప బీసీలు  మాత్రం  తీవ్రంగా  నష్టపోతారు అనేది నిజం.  తెలంగాణ  అసెంబ్లీ పాస్  చేసిన బీసీలకు 42% రిజర్వేషన్లు  తొమ్మిదో  షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లోకి పెట్టడానికి కేంద్రానికి మనసు రావడం లేదు.  ఇది స్పష్టంగా  బీసీలకు అన్యాయం చేస్తున్నట్టే లెక్క.  కులగణన చేస్తామని  చెప్తున్నారు.  కానీ,  మొదటి దశలో  ఓబీసీల  గృహాలను లెక్కిస్తలేరు.  మరి  రెండోదశలో  కూడా  ఓబీసీలను  లెక్కిస్తారా లేదా,   లెక్కించినా ఆ లెక్కలు ప్రజల ముందు ఉంచుతారా లేదా అనేది?  మిలియన్​  డాలర్ల ప్రశ్న. 

మా డిమాండ్లు

ముందుగా  ఓబీసీలకు  చట్టసభల్లో  వెర్టికల్ రిజర్వేషన్ కల్పించాలి.  ప్రతి పదేండ్లకు రాజ్యాంగ సవరణ చేసి  ఎస్సీ, ఎస్టీలకు  ఇస్తున్నట్లుగానే రాజ్యాంగం  సవరణ చేసి బీసీలకు  కూడా కనీసం 27%  చట్టసభలలో  అమలుచేయాలి.  అందులోనే  1/3  మహిళా రిజర్వేషన్ (ఓబీసీ మహిళల ఉప కోటా) అమలు చేయాలి.  కుల జనగణన ఆధారంగా ఓబీసీ ప్రాతినిధ్యం నిర్ణయించాలి.  తెలంగాణ  ప్రభుత్వం పంపిన 42%  రిజర్వేషన్స్ బిల్లులను  ఈ  పార్లమెంట్  సెషన్స్​లో  ఆమోదించి  9వ షెడ్యూల్​లో  చేర్చాలి. ఇవి లేకుండా ఈ చట్టం పూర్తి న్యాయం చేయదు.   ‘హిస్సా లేకుండా సమానత్వం రాదు.  ప్రాతినిధ్యం లేకుండా ప్రజాస్వామ్యం  పూర్తికాదు.  కేంద్ర ప్రభుత్వం  ఓబీసీలకు న్యాయం చేయదని  అనేకచర్యల  ద్వారా తెలుస్తూనే ఉంది.  అలాగే  కాంగ్రెస్,  బీఆర్ఎస్  పార్టీలు కూడా  మౌనంగా ఉండి  బీసీలకు అన్యాయం చేస్తున్నాయి.   కాబట్టి  ఓబీసీ  సంఘాలు దేశవ్యాప్తంగా  పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తమకు చెందాల్సిన  రిజర్వేషన్లను  తమ హక్కుగా  సాధించుకోకపోతే  మరొకసారి మోసపోయినట్టే  లెక్క.

- టి. చిరంజీవులు
రిటైర్డ్  ఐఏఎస్​​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.