MGBS మెట్రో స్టేషన్లో పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభం

 MGBS మెట్రో స్టేషన్లో పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజలకు గుడ్ న్యూస్. దేశంలోనే తొలిసారిగా మెట్రో స్టేషన్ లో పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభమైంది. హైదరాబాద్ మహాత్మ గాంధీ బస్ స్టేషన్ (MGBS) మెట్రో స్టేషన్ లో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని మంగళవారం (సెప్టెంబర్ 16) ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. 

మంగళవారం ఉదయం పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిరోజూ 4 వేల 500 పాస్ పోర్టులు జారీ చేసే సామర్థ్యం ఈ సెంటర్ కు ఉన్నట్లు మంత్రి తెలిపారు. మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ కాంప్లెక్స్ లో పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది మొదటిసారి అని సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. 

ప్రజలకు అత్యంత వేగంగా, పారదర్శకంగా పాస్ పోర్టును అందించేందుకు మెట్రో స్టేషన్ లో ప్రారంభించినట్లు తెలిపారు. అదికారులు వీలైనంత త్వరగా నిబంధనలకు అనుకూలంగా పాస్ పోర్టులు జారీ చేయాలని సూచించారు. అదే విధంగా పోలీస్ వెరిఫికేషన్ కూడా జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఆయన సూచించారు. 

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాస్ పోర్టు జారీ కోసం డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎప్పట్నుంచో అభ్యర్థిస్తున్నారు. ఓల్డ్ సిటీ అవసరాల దష్ట్యా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. 

తెలంగాణలో ప్రస్తుతం మొత్తం ఐదు పాస్ పోర్టు కేంద్రాలున్నాయి. అందులో మూడు హైదరాబాద్ లోని అమీర్ పేట్, బేగంపేట్, టోలిచౌకి ప్రాంతాల్లో  ఉన్నాయి. MGBS లో ప్రారంభించే ఈ పాస్ పోర్టు కేంద్రం సిటీలో నాలుగో సెంటర్.