- బీఆర్ఎస్ హయాంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు
- బిల్లులు రాక సొంత ఆస్తులు అమ్ముకున్నామని ఆవేదన
- గత ఐదేండ్లలో పదుల సంఖ్యలో సర్పంచుల బలవన్మరణం
- రూ.530 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయంటున్న మాజీ సర్పంచ్‌లు
హైదరాబాద్, వెలుగు : ఈసారి పంచాయతీ ఎన్నికల్లో వింత పరిస్థితి నెలకొన్నది. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారిలో చాలామంది ప్రస్తుత ఎన్నికల్లో కనీసం నామినేషన్‌కూడా వేయలేదు. బీఆర్ఎస్హయాంలో లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచులకు నేటికీ బిల్లులు రాలేదు. దీంతో ఈసారి రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నా.. చాలామంది పోటీకి దూరంగా ఉండిపోయారు.
అప్పటి సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు భూములు, బంగారం కుదవబెట్టి అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, కానీ బిల్లులు ఇవ్వకపోవడంతో ఉన్న ఆస్తులు అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాత అప్పులే ఇంకా తీరకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నిలబడలేదని వాపోతున్నారు.
దొరికినకాడల్లా అప్పుచేసి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతివనాలు, క్రీడాప్రాంగణాలు లాంటి నిర్మాణాలను సర్పంచ్ల ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందుకు నయా పైసా కేటాయించకపోగా, హరితహారం, నర్సరీల నిర్వహణలాంటి అనేక పనులను సర్పంచుల నెత్తిన రుద్దింది. ‘పని జరగాల్సిందే.. లేదంటే సస్పెండ్ చేస్తాం’ అంటూ కలెక్టర్లు, ఎంపీడీవోల ద్వారా ఒత్తిడి తేవడంతో దొరికినకాడల్లా అప్పులు తెచ్చి మరీ ఆయా నిర్మాణాలు పూర్తిచేశారు. మరికొందరు గ్రామస్తుల ఒత్తిడితో, అధికారుల మౌఖిక ఆదేశాలతో ‘శాంక్షన్’ లేని పనులు సైతం చేశారు.
ఈ క్రమంలో ఒక్కో మాజీ సర్పంచ్ రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు అప్పులు చేశారు. ఇందుకోసం భూములు, బంగారం కుదవబెట్టారు. అసలు, వడ్డీ కలిసి రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో అప్పులవాళ్ల వేధింపులు భరించలేక పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు ఆస్తులు అమ్ముకొని రోడ్డునపడ్డాయి. కొందరు సర్పంచ్‌లైతే కూలీలుగా మారి భారంగా బతుకులీడుస్తున్నారు. మొత్తం రూ.531 కోట్లు వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నోసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా.. వివిధ రూపాల్లో నిరసన తెలియజేసినా.. చిల్లిగవ్వ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికితోడు పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు, చేర్పుల కారణంగా పంచాయతీలు స్వయం ప్రతిపత్తి కోల్పోయాయని, నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిక్కుచూడాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఉప సర్పంచ్‌కు చెక్పవర్ఇవ్వడంతో పల్లెల్లో రాజకీయాలు తీవ్రమయ్యాయని చెప్తున్నారు. అందుకే ఈసారి పోటీకి దూరంగా ఉన్నామంటున్నారు.
పాత అప్పులు భయపెట్టినై..
గత ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశా. బిల్లులు రాకపోవడంతో నా భర్త రవి అప్పులు, వడ్డీల భారంతో మనస్తాపంతో 2022లో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనతో గత ప్రభుత్వం హడావుడిగా కొంత బిల్లు మంజూరు చేసింది. ఆ టైంలో రూ.6.50 లక్షల బకాయిలు రాగా అప్పులు కట్టుకున్నా. ఇంకా రూ.3.50 లక్షలు పెండింగ్ బిల్లు రావాల్సి ఉంది. ఎస్టీ జనరల్ వచ్చినా, పాత అప్పులు, వడ్డీల భయంతో పోటీ చేయలేదు.
- కట్రావత్ మణెమ్మ, కంసానిపల్లి మాజీ సర్పంచ్ , ఉప్పునుంతల మండలం,
నాగర్ కర్నూల్ జిల్లా
ప్రభుత్వం ఆదుకోవాలి
పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం ఎన్నోసార్లు ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ఇప్పటికైనా మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో రియల్ ఎస్టేట్, గ్రానైట్, ఇసుక దందా ఉన్నచోట రూ.లక్షలు పెట్టి వేలం పాటలు పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అలాంటి పంచాయతీలపై ప్రభుత్వం దృష్టిసారించి నియంత్రించాలి.
- సుర్వి యాదయ్య గౌడ్, మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ చైర్మన్
బిల్లులు రాక అప్పుల పాలైన..
సర్పంచ్‌గా గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు రూ.10 లక్షల బిల్లు రావాల్సి ఉంది. చెల్లింపులు చేయకపోగా అప్పుల పాలయ్యా. ఈసారి బీసీ మహిళ రిజర్వేషన్ అయినా, నా భార్య పోటీ చేసే చాన్స్ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలబడలేదు. అప్పులు తీర్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే, నాలాంటి మాజీ సర్పంచుల పరిస్థితి కొంతైనా మారుతుంది. లేకపోతే ప్రజాసేవ చేసినవారే ఆర్థికంగా కుంగిపోతున్నారు.
- గరిగంటి మల్లేశం, మాజీ సర్పంచ్ అప్పారావుపేట, కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా
ఏకగ్రీవమన్నా.. పోటీ చేయలే
పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు సుమారు రూ.18 లక్షల బిల్లు పెండింగ్‌లోనే ఉంది. దీంతో అప్పుల ఊబిలో కూరు కుపోయాను. ఈసారి మా గ్రామం బీసీ మహిళకు రిజర్వేషన్ అయినా... గతంలో నాపై నమ్మ కం ఉంచి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటామన్నారు. కానీ ఆర్థిక స్థోమత లేక పోటీ నుంచి తప్పుకున్నా. ప్రభుత్వం వెంటనే బిల్లు లు చెల్లించకపోతే చాలా మంది మాజీ సర్పంచులు నాలాగే రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితి ఉంది.
- తునికి నరసయ్య, దమ్మయపేట మాజీ సర్పంచ్, కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా
రిజర్వేషన్ కలిసొచ్చినా.. పోటీ చేయలే
గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షలు అప్పుతెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేశా. వాటి బిల్లులు ఇంకా రాలేదు. తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగిపోతోంది. ఈసారి రిజర్వేషన్ అనుకూలంగా ఉన్నా.. నేను పోటీ చేయలేదు. ప్రభుత్వం వెంటనే మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించి కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలి.
- జర్పుల రామారావు, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్, కామేపల్లి మండలం , ఖమ్మం జిల్లా
బిల్లుల భయంతో పోటీకి దూరంగా ఉన్నా..
దాచారం సర్పంచ్‌గా ఐదేండ్లు పనిచేసిన. వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ. 30 లక్షలు ఖర్చు చేశా. వీటికి సంబందించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రిజర్వేషన్ అనుకూలించినా.. బిల్లుల భయంతోనే పోటీకి దూరంగా ఉన్నాను. మళ్లీ పోటీ చేసి ఖర్చు పెట్టుకునే ఉద్దేశం లేదు.
- పెంటమీది శ్రీనివాస్, దాచారం మాజీ సర్పంచ్, బెజ్జింకి మండలం, సిద్దిపేట జిల్లా
