పసుపు బోర్డు కోసం పాదయాత్ర

పసుపు బోర్డు కోసం పాదయాత్ర

వెల్కటూరు నుంచి ప్రారంభం
బోర్డు ఏర్పాటయ్యే దాకా ఆగదు
రైతు జేఏసీ నాయకుడు అన్వేశ్‌ రెడ్డి

మోర్తాడ్, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటు కోసం పాదయాత్ర మొదలైంది. రైతు  జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా వెల్కటూరు గ్రామం నుంచి సోమవారం యాత్ర ప్రారంభమైంది. మహిళా రైతులు స్థానిక శివాలయంలో పూజలు చేసిన తర్వాత యాత్ర స్టార్టయింది. నేతలు గ్రామగ్రామాన తిరుగుతూ సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. బోర్డు ఏర్పాటు, రూ.15 వేల మద్దతు ధర, బోర్డుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కేంద్రంపై రాష్ట్ర నేతలు ఒత్తిడి చేయాలని, మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు పాదయాత్ర సాగుతుందని జేఏసీ నాయకుడు అన్వేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన 5 రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తామన్న ఎంపీ అర్వింద్‌ మాట మార్చారని విమర్శించారు. పంట చేతికొచ్చిన ప్రతిసారీ రైతులు ఆందోళన చెందుతున్నారని, బోర్డు ఏర్పడితే ఈ బాధలు తప్పుతాయని అన్నారు. పార్టీలకతీతంగా ప్రతి గ్రామం నుంచి వంతుల వారీగా యాత్రలో పాల్గొనాలని కోరారు. వెల్కటూరులో మొదలైన యాత్ర సవెల్, కోడిచెర్ల మీదుగా మెండోరా మండల కేంద్రానికి చేరుకుంది. యాత్రలో సునీల్‌రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, దేగం యాదగౌడ్, కిషన్, సారా సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి