IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్‌తో అదరగొట్టాడుగా

IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్‌తో అదరగొట్టాడుగా

ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ అంటే హైదరాబాద్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆడమ్ గిల్ క్రిస్ట్, డేవిడ్ వార్నర్ ఇప్పుటికే ఐపీఎల్ టైటిల్ అందించి తెలుగు నాట బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం కమ్మిన్స్ వంతు వచ్చింది. ఈ ఆసీస్ సారధి సన్ రైజర్స్ కెప్టెన్ గా అడుపెట్టిన తర్వాత వరుస విజయాలతో సత్తా చాటుతుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. దీంతో కమ్మిన్స్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతుంది. 

ఇటీవలే మహేష్ బాబుతో సెల్ఫీ దిగి అందరినీ సర్ ప్రైజ్ చేసిన కమ్మిన్స్.. తాజాగా నేడు (ఏప్రిల్ 24) స్టార్ స్పోర్ట్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో తెలుగు డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే సంజ్ఞ చేతితో చేస్తూ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేశాడు. కమ్మిన్స్ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుత సీజన్ లో కమ్మిన్స్ కెప్టెన్ గా, ప్లేయర్ గా ఆకట్టుకుంటున్నాడు. జట్టుకు వరుస విజయాలను అందిస్తూ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాడు. రేపు (ఏప్రిల్ 25) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. సొంతగడ్డపై ఈ సీజన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోని సన్ రైజర్స్ ఆ రికార్డ్ ను కొనసాగించాలని భావిస్తుంది. మరోవైపు ఆడిన 8 మ్యాచ్ ల్లో ఒకటే విజయాన్ని అందుకున్న బెంగళూరు జట్టు సన్ రైజర్స్ కు షాక్ ఇవ్వాలని చూస్తుంది.