విధుల్లో నిర్లక్ష్యం.. పటాన్ చెరు సీఐ సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం.. పటాన్ చెరు సీఐ సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పటాన్ చెరు సీఐ లాలు నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. డిసెంబర్ 24 వ తేదిన రాత్రి పటాన్ చెరుకి చెందిన నాగేశ్వర్ రావు అనే వ్యక్తిపై దాడి కేసులో సీఐ నిర్లక్ష్యం చేయడంతో వ్యక్తి మరణించాడనే  ఆరోపణలు ఉన్నాయి.  బాధితుడి కుటుంబ సభ్యులు సీఐపై ఫిర్యాదు చేశారు.  మిస్సింగ్ కేసుపై సమాచారం ఇచ్చినా సీఐ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని  విచారణలో తేలడంతో జిల్లా ఎస్పీ రూపేష్ సస్పెండ్ చేశారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసినా పట్టించుకోలేదని సీఐని సస్పెండ్ చేశారు. సీఐ లాలు నాయక్ స్థానంలో పటాను చెరు ఇన్ ఛార్జ్ గా సీఐగా శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు జిల్లా ఎస్పీ రూపేష్. 

ఇటీవల రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో సీఐ సతీష్ జోక్యం చేసుకోవటంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సతీష్.. సివిల్ కేసు వివాదంలో ఇన్వాల్వ్ అయినట్లు విచారణలో తేలటంతో సస్పెండ్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

అలాగే సైబరాబాద్  కమిషనరేట్ పరిధిలోనూ ఇద్దరు  సీఐలు సస్పెండ్ అయ్యారు.  భార్యాభర్తల మధ్య  వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని చితకబాదిన కేసులో  కేపీ హెచ్ బీ సీఐ వెంకట్ ను , మరో కేసులో సరిగా విచారణ చేయనందుకు ఎయిర్ పోర్ట్ సీఐ  శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ  సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.