పారిశ్రామిక హబ్గా పటాన్చెరు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పారిశ్రామిక హబ్గా పటాన్చెరు: మంత్రి వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి, వెలుగు: మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే భవిష్యత్తులో భూమికి కూడా భూధార్ మ్యాప్‌‌‌‌‌‌‌‌ ప్రవేశపెట్టనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖను పారదర్శకంగా, అవినీతి రహితంగా మార్చేందుకు భారీ సంస్క రణలు అమలు చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌‌‌‌‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో నిర్మించనున్న ఉమ్మడి మెదక్ జిల్లా 39 సబ్‌‌‌‌‌‌‌‌ -రిజిస్ట్రార్ ఆఫీసుల ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌కు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, భూ భారతి కార్యక్రమం ద్వారా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒకే ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారంలో భూమి వివరాలు, సరిహద్దులు, నిషేధిత సర్వే నంబర్ల వివరాలు అందుబాటులో ఉండే వ్యవస్థను రూపొందించనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల డబుల్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవన్నారు. అధునాతన టెక్నాలజీతో భూముల సర్వే కోసం 5,500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను ఇప్పటికే నియమించామని వెల్లడించారు. భూ సమస్యలు లేకుంటే జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు మరింతగా వస్తాయని తెలిపారు. 

అత్యాధునిక సదుపాయాలు, కార్పొరేట్ ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను రాష్ట్రమంతా దశలవారీగా నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి విడతగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా బుధవారం కర్ధనూర్‌‌‌‌‌‌‌‌లో శంకుస్థాపన చేశామని చెప్పారు. ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ బాధ్యతలను రాజ్ పుష్ప ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి అప్పగించామని, ఆరు నెల్లలో కాంప్లెక్స్ పూర్తవుతుందని వెల్లడించారు. 

భూమికి భూధార్ మ్యాప్‌‌‌‌‌‌‌‌.. పారిశ్రామిక హబ్‌‌‌‌‌‌‌‌గా పటాన్‌‌‌‌‌‌‌‌చెరు: 

పటాన్‌‌‌‌‌‌‌‌చెరు తెలంగాణ పారిశ్రామిక హబ్‌‌‌‌‌‌‌‌గా మారిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకురావాలంటే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యలు తలెత్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, అధికారులు పాల్గొన్నారు.