సామాన్యులకు చేరువగా టూరిజం ప్యాకేజీలు : టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి

సామాన్యులకు చేరువగా టూరిజం ప్యాకేజీలు : టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి
  •     టూరిజం కార్పొరేషన్​ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా పర్యాటక ప్యాకేజీలను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం హయత్‌నగర్‌‌లోని టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో నిలిచిపోయిన తిరుపతి ప్యాకేజీని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి ప్యాకేజీ పునరుద్ధరణ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని  పేర్కొన్నారు. 

ఈ విషయంలో ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశామని, కార్పొరేషన్ తరపున మరోసారి లేఖ రాస్తామని వెల్లడించారు. ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా ప్రభుత్వ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, దానికి అనుగుణంగా అన్ని పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.