దయనీయం.. జోరువానలో తండ్రి మృతదేహాన్ని 20 కి.మీలు మోసుకెళ్లిన కొడుకులు

దయనీయం.. జోరువానలో తండ్రి మృతదేహాన్ని 20 కి.మీలు మోసుకెళ్లిన కొడుకులు
  • జట్టీ కట్టి అడవుల్లోంచి మోసుకెళ్లిన కొడుకులు
  • చత్తీస్​గఢ్ ​దండకారణ్యంలో దయనీయన ఘటన


భద్రాచలం, వెలుగు: జోరువాన, వాగులు పొంగి రోడ్లు జలమయం కావడంతో అడవుల్లోంచి తండ్రి మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన హృదయవిదారక ఘటన చత్తీస్ గఢ్ దండకారణ్యంలో సోమవారం చోటుచేసుకుంది. సుక్మా జిల్లా కిష్టారం పంచాయతీలోని ఆర్లపెంట గ్రామానికి చెందిన రవ్వా భీముడు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. 

ఖర్చులు పెరగడంతో బంధువులు పారా ఇటాన్పాడ్ గ్రామంలో ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. భారీ వర్షాలకు వాగులు పొంగడం, రోడ్లు జలమయం కావడంతో సొంతూరు ఆర్లపెంటకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనాలేవి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొడుకులు జట్టీ కట్టి తండ్రి మృతదేహాన్ని అందులో పెట్టుకొని సొంతూరుకు బయల్దేరారు. కానీ భారీ వర్షాలతో వాగులు పొంగి తీగన్​పల్లి గ్రామం వద్ద ఆగిపోయారు. 

అక్కడి నుంచి దాదాపు 20 కి.మీలు అటవీ మార్గం గుండా మృతదేహాన్ని మోసుకుంటూ సోమవారం ఇంటికి చేరుకున్నారు. అంత్యక్రియలు చేశారు. చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో సరైన రోడ్డు సౌకర్యం, వాగులపై వంతెనలు లేక ఆదివాసీలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఈ ఘటన మరోసారి కళ్లకుకట్టింది.