
కరీంనగర్, వెలుగు: జ్వరంతో వచ్చిన ఆ వ్యక్తికి మూడు రోజులు ట్రీట్మెంట్చేశారు. బాగైంది… ఇక వెళ్లిపోవచ్చని చెప్పారు. ఇంటికి బయలుదేరిన ఆ వ్యక్తి అరగంట కూడా గడవకముందే దారిలోనే మృత్యువాత పడిన సంఘటన కరీంగనర్‌లో బుధవారం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండ పల్కల గ్రామానికి చెందిన పడుపు శంకర్(65) జ్వరం రావడంతో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో మూడు రోజుల కిందట చేరాడు. రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నాడు. స్కానింగ్, రక్త, మూత్ర పరీక్షలు చేయమని కుటుంబ సభ్యులు కోరినా చేయలేదు. మూడు రోజుల తర్వాత ఆరోగ్యం బాగానే అయింది… ఇంటికి వెళ్లమని దవాఖాన సిబ్బంది సూచించారు. వాళ్లు చెప్పినట్లుగానే భార్య రాజేశ్వరీ, చెల్లెలితో కలిసి హాస్పిటల్నుంచి ఆటోలో బయలుదేరారు. నగరంలోని సిక్కువాడి చౌరస్తా సమీపంలోని ఆటో స్టాండ్ కు చేరుకున్నారు. ఆటో దిగిన కాసేపటికే శంకర్ కుప్పకూలిపోయి మృతిచెందాడు.
గంటపాటు రోడ్డు పక్కనే..
శంకర్ వెంట ఆ సమయంలో ఇద్దరు మహిళలే ఉన్నారు. సొంత గ్రామం కొండపల్కలకు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వారి చేతిలో పైసలు లేవు. అక్కడ ఉన్న ఆటోవాళ్లను ఎంత బతిమాలినా ఎవరు ముందుకు రాలేదు. దిక్కుతోచక మృతదేహం వద్ద రోదిస్తూ అక్కడే గంటపాటు కూర్చున్నారు. స్థానికుల సమాచారంతో మాజీ మేయర్ రవీందర్ సింగ్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికప్పుడు ప్రైవేటు ఆంబులెన్సు తెప్పించి వారిని ఇంటికి పంపించారు. శంకర్‍కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.