
NRI News: జనవరిలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్ యూనివర్సిటీల్లో చదువుతున్న లక్షల మంది విదేశీ విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రధానంగా భారతీయ విద్యార్థులు డిపోర్ట్ అవుతున్న వారిలో ఎక్కువగా ఉండటం కొంత ఆందోళనలు కలిగిస్తోంది.
అయితే తాజాగా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఒక శుభవార్త ఉంది. యూఎస్ ఎంబసీ విద్యార్థులకు వేల సంఖ్యలో వీసా అప్లికేషన్లను మిషన్ ఇండియా కింద అందుబాటులో ఉంచినట్లు తన అధికారిక ఎక్స్ ఖాతాలో సోమవారం పోస్ట్ చేసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు యూఎస్ వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తాజా ట్వీట్ ప్రకారం తెలుస్తోంది.
అమెరికా స్టూడెంట్ వీసాలకు అత్యధిక ప్రాధాన్యతను అందిస్తున్నట్లు ఏప్రిల్ 2024లో భారత యూఎస్ ఎంబసీ ప్రతిని ఎరిక్ గార్సెట్టి వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య సంబంధాలు జీవితకాలం గుర్తుండిపోతాయని ఆ సమయంలో గార్సెట్టి అభిప్రాయపడ్డారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు వీసాలను అందించే ప్రయత్నంలో భాగంగా మిషన్ ఇండియాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
2023లో అత్యధికంగా రికార్డు స్థాయిలో యూఎస్ ఎంబసీ 14 లక్షల వీసాలను ప్రాసెస్ చేసింది. అలాగే అమెరికా వీసాలను అత్యధిక సంఖ్యలో దక్కించుకుంటున్న వ్యక్తుల్లో భారతీయులు, భారతీయ విద్యార్థులు ఉన్నట్లు గణాంకాలు కూడా చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయటం చిన్న తప్పులకు సైతం దేశం నుంచి వ్యక్తులను డిపోర్ట్ చేయటం, యూనివర్సిటీల్లో విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను మానిటర్ చేయటం వంటి చర్యలు చాలా మందికి న్యాయపరమైన చిక్కులను తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే.
మారిన నిబంధనలను అర్థం చేసుకుని దానికి తగినట్లుగా అక్కడికి వెళ్లిన తర్వాత భారతీయ విద్యార్థులు మెళకువలు పాటించటం, అప్రమత్తంగా ఉంటూ న్యాయపరమైన చర్యల్లో చిక్కుకోకుండా ఉండటం తప్పనిసరని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే సరైన యూనివర్సిటీలను ఎంచుకోవటం కూడా ప్రస్తుతం ఉన్న సమయంలో చాలా కీలకమైనదిగా వారు భావిస్తున్నారు.