‘పుల్వామా’ దాడికి బదులు తీర్చుకున్న ‘ఆపరేషన్ సింధూర్’.. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న.. మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది హతం

‘పుల్వామా’ దాడికి బదులు తీర్చుకున్న ‘ఆపరేషన్ సింధూర్’.. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న.. మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది హతం

పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు పాక్పై భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల్లో జైష్-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యుల్లో 10 మంది చనిపోయినట్లు బీబీసీ ఉర్దూలో కథనం ప్రచురితమైంది. మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు అతనికి సంబంధించిన నలుగురు బంధువులు కూడా చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల సమయంలో పాకిస్తాన్తో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మిసైల్స్ ప్రయోగించింది.

జైష్-ఈ-మహ్మద్, లష్కర్-ఈ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. బహవల్పూర్లోని సుభాన్ అల్లాహ్ కాంప్లెక్స్పై ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా ఐఏఎఫ్ ఎయిర్ స్టైక్స్ జరిపింది. ఈ దాడుల్లో మసూద్ అజర్ అక్క, అక్క భర్త, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మేనకోడలు.. మసూద్ అజర్ కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయినట్లు బీబీసీ ఉర్దూ రిపోర్ట్ చేసింది. 

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌ హెడ్ క్వార్టర్స్ ‘మర్కజ్ సుభానల్లా’పై కూడా భారత్ వైమానిక దళం దాడులు చేసింది. పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌లోని బహవల్పూర్లో మూడు ఎకరాల మైదానంలో ఉన్న ఈ భవనం సకల సౌకర్యాలకు నిలయం. దాదాపు 600 మంది టెర్రరిస్టులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మూడంతస్తుల ఈ భారీ భవనాన్ని కట్టేందుకు జైషే చీఫ్ మసూద్ అజర్‌‌‌‌‌‌‌‌కు మూడేళ్లు పట్టింది. స్విమ్మింగ్ పూల్, జిమ్ తదితర అత్యాధునిక వసతులతో దీన్ని కట్టారు.

జైషేలో చేరిన ఏ టెర్రరిస్టుకైనా ముందు బహవల్పూర్లో హెడ్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత బాలాకోట్లోని ట్రైనింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు పంపుతారు. మసూద్ అజర్, అతని సోదరులు, ముఖ్య అనుచరులు మర్కజ్ సుభానల్లాలోనే ఉంటారు. పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలతో మసూద్ అజర్ ఆ ప్రదేశం ఖాళీ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా దాడులు తమ పనేనని జైష్-ఈ-మహ్మద్ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.