టోకెన్ల కోసమే గంటలకొద్దీ వెయిటింగ్​

టోకెన్ల కోసమే గంటలకొద్దీ వెయిటింగ్​

హైదరాబాద్, వెలుగు:  నిమ్స్ దవాఖానలో ఓపీ సేవల కోసం వస్తున్న పేషెంట్లు నరకాన్ని చూస్తున్నారు. పలు విభాగాల్లో ఉదయం10 గంటలు దాటినా ఓపీ స్టార్ట్ కాకపోవడంతో పేషెంట్లు బారులు తీరుతున్నారు. ఓపీలు ఆలస్యంగా మొదలు పెడుతుండటంతో డాక్టర్లు వచ్చేలోపే వందలాది మంది పేషెంట్లు వెయిటింగ్​లో ఉంటున్నారు. ఓపీల్లో పేషెంట్లు కూర్చునేందుకు సరిపడా కూర్చీలు లేకపోవడంతో ఓపీ టోకెన్​లను పట్టుకొని డాక్టర్ల కోసం నిలబడే ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఒకటి, రెండు మినహా అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. నిమ్స్​లో రోజురోజుకూ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడంలేదు. కరోనా తర్వాతరోజూ వెయ్యి మంది ఓపీలకు వచ్చేవారు. ఇప్పుడు డైలీ 2 వేలకుపైనే పేషెంట్లు వస్తున్నారు. బుధవారం 2,208 మంది ఓపీలో వైద్యసేవలు పొందారు. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. ఒకవైపు ఫెసిలిటీస్ సరిగా లేకపోగా.. మరోవైపు డాక్టర్లు టైంకు రాకపోవడంతో పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. కొందరు టెస్టుల కోసం ఏమీ తినకుండా వస్తున్నారు. దీంతో ఖాళీ కడుపులతో గంటల తరబడి వెయిట్ చేస్తూ నరకం చూస్తున్నారు. దీంతో ఓపిక నశించిన కొందరు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. డాక్టర్లు లేట్​గా వస్తే తామేం చేయాలని సిబ్బంది బదులిస్తున్నారు. 

రౌండ్ల పేరుతో కూర్చోపెడుతున్నరు 

నిమ్స్​ఓపీకి పొద్దున 6 నుంచే పేషెంట్లు వస్తున్నారు. రెమటాలజీ వంటి డిమాండ్ ఉన్న వాటికైతే తెల్లవారుజామున 4, 5 గంటలకు వస్తేనే ఓపీ లభించే అవకాశం ఉంది. ఈ డిపార్టుమెంట్ కి దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లయితే రాత్రికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. కార్డియాలజీ, ఆర్థో, న్యూరో, గ్యాస్ర్టో విభాగాల్లోనూ పేషెంట్లు బారులు తీరుతున్నారు. ఉదయం 8కే ఓపీలు స్టార్ట్ చేయాల్సి ఉన్నా.. 9, 10 గంటల తర్వాతనే స్టార్ట్ అవుతున్నాయి. ఓపీ టోకెన్లు తీసుకొని ఆయా విభాగాల్లో డాక్టర్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. డాక్టర్లు ఎప్పుడు వస్తారని అడిగితే వార్డుల్లో రౌండ్లలో ఉన్నారని, టైమ్ చెప్పలేమని సిబ్బంది చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో పది తర్వాత కూడా డాక్టర్లు ఉండటంలేదు.    

పేషెంట్లకు నానా అవస్థలు 

ఓపీ కోసం వెయిటింగ్ చేసే పేషెంట్లు కూర్చునేందుకు కూడా సరిపడా చైర్లు ఉండటం లేదు. డైలీ 300 మందికిపైగా పేషెంట్లు వచ్చే కార్డియాలజీ విభాగంలో 20 చైర్లు మాత్రమే ఉన్నాయి. మిగతా వారు డాక్టర్ల క్యాబిన్ల వద్ద నిలబడాల్సి వస్తోంది. అసలే హార్ట్ పేషెంట్లు కావడంతో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కింద కూర్చుంటున్నారు. న్యూరోలోనూ పేషెంట్లకు కుర్చీలు సరిపోవడంలేదు. ఆర్థో విభాగం వద్ద కూడా పేషెంట్లు కిందనే కూర్చోవాల్సి వస్తోంది. ఇక పైఅంతస్తుల్లోని ఓపీలకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదు. లిఫ్ట్ ల్లో వెళ్లేందుకు ఎక్కువ మంది ఉండటంతో లిఫ్ట్ ల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రద్దీ ఎక్కువవడంతో పై ఫ్లోర్లకు వెళ్లాలంటే కనీసం 15, 20 నిమిషాలు లిఫ్ట్ ల దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవస్థలు పడి డాక్టర్లను కలిస్తే టెస్టులు రాస్తున్నప్పటికీ, అదేరోజు మళ్లీ డాక్టర్లను కలిసే అవకాశం ఉండటంలేదు. మొత్తంగా మందులు మాత్రమే రాయాల్నా? సర్జరీ అవసరమా? అన్నది డాక్టర్లు చెప్పేందుకు కనీసం 3, 4 రోజులు పడుతోంది. కొన్ని వ్యాధులకైతే వారానికిపైగా పడుతోంది. 

నిలబడలేకపోతున్నం

కార్డియాలజీకి రోజూ వందల మంది వస్తున్నారు. కొన్ని కుర్చీలే ఉండటంతో పేషెంట్లం నిలబడలేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం పేషెంట్లు కూర్చోడానికైనా చైర్లు వేయాలె. ఉదయం 8 గంటలకు రావాల్సిన డాక్టర్లు 10 వస్తే ఎట్లా? పేషెంట్ల సంఖ్యకు తగినట్టుగా డాక్టర్లను కూడా పెంచాలె.  

- శ్రీకాంత్, పేషెంట్ 

మూడ్రోజులకు అపాయింట్​మెంట్​

ఓపీలో టోకెన్ తీసుకోడానికే గంట పడుతోంది. మొదటి రోజు టెస్టులు మాత్రమే అవుతున్నాయి. రెండ్రోజుల తర్వాత రిపోర్టులు వస్తాయంటున్నరు. సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్​లు రాస్తే రెండు, మూడ్రోజులకు అపాయింట్ మెంట్ దొరుకుతుంది. అప్పటివరకు వెయిట్ చేయక తప్పడంలేదు. 
- జగన్, పేషెంట్ బంధువు 

డాక్టర్లు టైంకు వచ్చేలా చూస్తా 

ఓపీలకు డాక్టర్లు టైంకు రాకపోవడంపై వివరాలు తెలుసుకుంటాను. స్వయంగా ఓపీకి వెళ్లి చూస్తా. టైం మెయింటెన్ చేసేలా చూస్తా. ఈ మధ్య ఓపీ బాగా పెరుగుతోంది. పేషెంట్లకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అయితే కల్పిస్తున్నాం.  

- డాక్టర్ సత్యనారాయణ, నిమ్స్ సూపరింటెండెంట్