
అమరావతి: మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. హైకోర్టు నుంచి తప్పించుకోవడానికే మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం హడాహుడిగా నిర్ణయం తీసుకుందన్నారు. మరింత క్లారిటీతో కొత్త బిల్లులు తీసుకొస్తామని చెప్పి ప్రజల్ని ప్రభుత్వం మరింత గందరగోళంలోకి నెట్టేసిందన్నారు. దీంతో జగన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందన్న పవన్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా.. రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకువచ్చారన్నారు. వికేంద్రీకరణ అంటూ చిలకపలుకు పలుకుతున్న పాలకులు ..ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగి తేలుతున్నారని..రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి తాను ఆనాడు ఏమి చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందన్నారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుందని చెప్పారు పవన్.