
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. వాటిలో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రం ఒకటి. ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి మొదలైంది. మంగళవారం పవన్ కళ్యాణ్ సెట్స్‌లో జాయిన్ అయినట్టు తెలియజేశారు మేకర్స్.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫొటోల్లో పవన్ స్టైలిష్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. బ్లాక్ హూడీ, కూలింగ్ గ్లాసెస్‌తో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఉన్నారు పవన్. ముంబైలో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ నెలాఖరు వరకు ఉంటుంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
భారీస్థాయిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుజీత్. సినిమాటోగ్రాఫర్‌గా రవి కె చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాష్ వర్క్ చేస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మరోవైపు హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలతోపాటు సముద్రఖని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి పవన్ ఓ మూవీలో నటిస్తున్నారు.