
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ ఇంఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్ తో భేటీ ముగిసింది. పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ మురళీధరన్ తో దాదాపు 3 గంటల పాటు భేటీ అయ్యారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా కొందరిని కలవాల్సి ఉందని..అందరినీ కలిసిన తర్వాత మాట్లాడుతానని చెప్పారు. పవన్ మరి కాసేపట్లో కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవడం, పవన్ ఢిల్లీలో పలువురి బీజేపీ పెద్దలను కలవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
జనసేన జతకట్టేది ఎవరితో ?
పవన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా ఏపీలో బీజేపీ, జనసేన మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో పవన్ బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. మరో వైపు పవన్ టీడీపీతో జతకడతారని..చంద్రబాబు చెప్పినట్లే పవన్ వింటారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.పవన్ కూడా టీడీపీకి అనుకూలంగానే ఇప్పటి వరకు ప్రకటనలు చేశారు. ఓటు బ్యాంకును చీల్చబోమని పవన్ కూడా గతంలో ప్రకటించారు.
వారం రోజుల క్రితమే సీఎం జగన్ అమిత్ షాను కలిశారు.ముందస్తు ఎన్నికలుంటాయని ప్రచారం జరిగింది. కానీ ఏపీలో ముందస్తు ఎన్నికలుండవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. సరిగ్గా ఇదే టైంలో పవన్ ఢిల్లీ వెళ్లారు.
పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై పవన్ క్లారిటీ ఇస్తారా? బీజేపీతో జతకడతారా? లేక టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారా? సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.