శివరాత్రికి వస్తున్న పవన్ కళ్యాణ్

శివరాత్రికి వస్తున్న పవన్ కళ్యాణ్

సంక్రాంతికి పవన్ కళ్యాణ్‌‌ సినిమా ‘భీమ్లా నాయక్’ రిలీజవుతుందా లేదా అనే అనుమానాలు కొద్ది రోజులుగా అందరినీ వెంటాడుతున్నాయి. వాయిదా పడనుందని ఏ స్థాయిలో ప్రచారం జరిగిందో, ఆరు నూరైనా సంక్రాంతికే రిలీజవుతుందని నిర్మాతలు కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్‌‌ రిప్లై ఇచ్చారు. కానీ చివరికి సినిమాని వాయిదా వేయక తప్పలేదు. సంక్రాంతి సీజన్ టార్గెట్‌‌గా జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి 14న ‘రాధేశ్యామ్’ వస్తున్నాయి. మూడు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్స్‌‌కి వస్తే స్క్రీన్స్ సరిపోని పరిస్థితి నెలకొంటుంది. దీంతో రెండు చిత్రాల నిర్మాతలూ కలిసి పవన్ కళ్యాణ్‌‌తో పాటు ‘భీమ్లానాయక్’ నిర్మాతలతో మాట్లాడారు. వాళ్లు పాజిటివ్‌‌గా రియాక్టవడంతో ఈ సినిమా రిలీజ్‌‌ను సంక్రాంతి రేసు నుంచి తప్పించి, శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25కి ఫిక్స్ చేశారు.

ఈ విషయంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్‌‌ నుంచి దిల్ రాజు, డీవీవీ దానయ్య, దామోదర ప్రసాద్, స్రవంతి రవికిషోర్ లాంటి నిర్మాతలు మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ స్టార్ట్ చేసి మూడేళ్లవుతోంది. పైగా రెండూ ప్యాన్ ఇండియా సినిమాలు కనుక ఇతర భాషల్లోనూ సేమ్ డేట్‌‌కి రావలసి ఉంది. మూడు చిత్రాలకు ఎక్కువ థియేటర్స్ కేటాయించే పరిస్థితి లేకపోవడంతో పవన్‌‌తో, నిర్మాతలతో మాట్లాడి వాయిదా వేశాం. నిజానికి ఫిబ్రవరి 25న ‘ఎఫ్‌‌ 3’ రావాల్సి ఉంది. కానీ ‘భీమ్లా నాయక్‌‌’ కోసం ‘ఎఫ్‌‌ 3’ రిలీజ్‌‌ డేట్‌‌ని ఏప్రిల్‌‌ 29కి మార్చాం’ అని చెప్పారు. ఇక నిర్మాత నాగవంశీ సినిమాను వాయిదా వేసినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ‘సారీ.. అది నా చేతుల్లో లేదు. ఇండస్ట్రీ సంక్షేమానికి తపించే మా హీరో పవన్ కళ్యాణ్ గారి మాటలకు నేను కట్టుబడ్డాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.