ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిని చూస్తున్నట్లు అనిపించేది : పవన్ కళ్యాణ్

ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిని చూస్తున్నట్లు అనిపించేది : పవన్ కళ్యాణ్

సీనియర్ హీరో చంద్రమోహన్ (Chandra Mohan) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్..హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తా విని హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆవేదన చెందినట్లు ప్రకటన విడుదల చేశారు. 

చంద్రమోహన్ లాంటి నటుడు సినీ పరిశ్రమలో ఉండటం మన కళామతల్లి అదృష్టం.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేదన్నారు.

కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనను చూపించారన్నారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారని పవన్ గుర్తు చేసుకున్నారు. 

అన్నయ్య చిరంజీవితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో అతను నటించినట్లు..అలాగే తన మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో చాలా మంచి పాత్ర పోషించారన్నారు.

తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్..ఆడియన్స్ని బాగా అలరించాయని గుర్తు చేసుకున్నారు పవన్. చంద్రమోహన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని..పవన్ తన ప్రకటనలో తెలిపారు.