వైసీపీ నాయకులు కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలి

వైసీపీ నాయకులు కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలి

ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు తీసివేసి ఇంగ్లీష్‌ను ప్రవేశపెట్టడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఆయా రాష్ట్రాలు తమ భాషను కాపాడుకుంటుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం అమ్మభాషను కాదని ఆంగ్లభాష వైపు వెళ్తుందని ఆయన అన్నారు. తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ఏం చేస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. వైసిపి నాయకత్వం.. భాష మరియు సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ సీఎం ‘శ్రీ కేసీఆర్’ నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు.

వైసీపీ నాయకులు తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకొని ఉంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించాలనే ఆలోచన వారికి వచ్చేది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేయడం కారణంగా మన భాష, సంస్కృతి మరుగున పడిపోతాయని ఆయన అన్నారు. పెద్ద బాలశిక్ష, తెలుగు వ్యాకరణం, ఆరుద్ర సమగ్ర సాహిత్యం, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి గొప్ప గొప్ప తెలుగు పుస్తకాలను తన లైబ్రరీ‌లో భద్రపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. 2017లో తెలుగు మహాసభల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ‘తొలిపొద్దు’ పుస్తకాన్ని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ పైవిధంగా స్పందించారు.