ఓటు అమ్ముకుంటే గులాంగిరీ తప్పదు: పవన్‌ కల్యాణ్‌

ఓటు అమ్ముకుంటే గులాంగిరీ తప్పదు: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. బీసీ కులాల ప్రజలను ఉద్దేశించి ఆయన మట్లాడారు. బీసీలలో ఐకత్య లేకపోవడమే మిగతా వారికి బలం అని పవన్ తెలిపారు. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత అని స్పష్టం చేశారు. తాను మానవత్వం, జాతీయ భావాలతో పెరిగానని, కాకపోతే సమాజంలో ఏఏ కులాలు వెనుకబడి ఉన్నాయో వాటిని భుజాలమీదికి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదని అన్నారు. తాను కాపు నాయకుడిని మాత్రమే కాదని, ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని వివరించారు. దేహీ అని అడిగే కొద్దీ రాజ్యాధికారం ఎవరూ ఇవ్వరని, రాజ్యాధికారాన్ని పోరాడి సాధించుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు.

ఒక బీసీ సదస్సు అంటే అందరు బీసీ నాయకులు వస్తారు కానీ, ఒక బీసీ నాయకుడ్ని ఎన్నికల్లో నిలబెడితే అతడిని మిగతా బీసీలందరూ ఓటేసి ఎందుకు గెలిపించరు? అని ప్రశ్నించారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించాలని... వైసీపీ, టీడీపీ కూడా స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. బీసీలకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలని హితవు పలికారు. రాజ్యాధికారం ఇస్తే కదా బీసీలు అభివృద్ధి చెందేది అని ఆక్రోశం వ్యక్తం చేశారు.  ఓటు అమ్ముకుంటే జీవితకాలం గులాంగిరీ తప్పదని అన్నారు. అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని, కానీ ఇన్నాళ్ల పాటు బీసీ కులాలు ఎందుకు ఐక్యత సాధించలేకపోయాయో అర్థం కావడంలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

కాగా, మరే తెలుగు హీరోకు సాధ్యం కానంత ఫ్యాన్ బేస్ కలిగిన పవన్.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. టాలీవుడ్‌కు పరిచయమైన పవన్.. నటుడిగా 27 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అలాగే తాను స్థాపించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే మార్చి 15వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ నుంచి గన్నవరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో వెళ్లారు.