వైఎస్ను ఎదుర్కొన్నా.. జగన్ ఓ లెక్క కాదు..

వైఎస్ను ఎదుర్కొన్నా.. జగన్ ఓ లెక్క కాదు..

వైఎస్ ను ఎదుర్కొన్న తనకు జగన్ ఓ లెక్క కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పంచలూడిపోయేలా తరిమికొట్టాలని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన చివర శ్వాస వరకు రాజకీయాలు వదలనని స్పష్టంచేశారు. తాను జనం కోసం ఉందామనుకుంటే తన కోసం ఎవరూ నిలబడలేదని అన్నారు. పైగా రెండు చోట్ల ఓడిపోయావని గేలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లో ప్రస్తుతం అందరూ వ్యాపారాలు చేసుకునే నాయకులే ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఇప్పటికిప్పుడు కాంట్రాక్టులు చేయలేనని అన్నారు. రాజకీయాల్లో నిలబడాలంటే తాను సినిమాలు చేయకతప్పదని, డబ్బు అవసరం లేనప్పుడు తానే సినిమాలు వదిలేస్తానని అన్నారు. తనకు పిరికితనం నచ్చదన్న పవన్.. గెలుపైనా ఓటమైనా తనకు పోరాటమే తెలుసని అన్నారు. వెధవల్ని, గూండాల్ని ఎదుర్కోవడం ఎలాగో తనకు బాగా తెలుసని చెప్పారు. పాలిటిక్స్ లోకి రాకపోతే తనను విమర్శిస్తున్న వాళ్లే తనతో ఫొటోలు దిగుతారని పవన్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం విజయంగా భావిస్తానని అన్నారు.