
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కథానాయకుడిగా తెరకెక్కిన 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu ). ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలకు తెరతీసింది. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తొలుత దర్శకుడు క్రిష్ ( Krish Jagarlamudi ) మంచి హై-కాన్సెప్ట్ కథతో వచ్చారని, అది తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఈ సినిమా కోసం నిర్మాత ఎ.ఎం. రత్నం ( AM Ratnam ) పడిన తపనన అంతా ఇంతా కాదు. మూవీ షూటింగ్ ప్రారంభం చేసినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఈ సినిమా నిలిచిపోతుందా.. అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ చివరికి పూర్తి చేశాం. ఒకప్పుడు రత్నం గారి కోసం డిస్ట్రిబ్యూటర్లు తిరిగేవారని, అలాంటి నిర్మాత ఆర్థిక ఇబ్బందులు పడటం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. డబ్బు గురించి కాదు, సినిమా సక్సెస్ గురించి కాదు, ఇండస్ట్రీ కోసం నిలబడటం ముఖ్యం అని పవన్ స్పష్టం చేశారు. ఖుషి సినిమా తీస్తున్నప్పుడు రత్నం గారు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. అలాంటి ఆయన ఇప్పుడు నలిగిపోతుంటే చాలా బాధ వేసింది అని పవన్ వివరించారు.
సినిమా విజయం ఎంత అవుతుందో తనకు తెలియదని, అయితే క్రిష్ మంచి కథతో వచ్చారని పవన్ పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో క్రిష్ ఈ చిత్రం నుంచి బయటకు వెళ్లినప్పటికీ, ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫౌండేషన్ వర్క్ మాత్రం క్రిష్‌దేనని పవన్ ఒప్పుకున్నారు. అలాగే, సంగీత దర్శకుడు కీరవాణి గురించి ప్రస్తావిస్తూ తాము ఈ సినిమా వస్తుందా లేదా అని నీరసపడినప్పుడుల్లా, దీనికి ప్రాణవాయువు ఇచ్చింది మాత్రం ఆయనే అని పవన్ ప్రశంసించారు. తాను సినిమా గురించి మాట్లాడనని, కేవలం క్వాలిటీపై మాత్రమే దృష్టి పెడతానని తెలిపారు.
నిర్మాతలు కనుమరుగవుతున్న సమయంలో, బిజీ షెడ్యూల్ వదిలేసి, ప్రతిపక్షాలు తిడుతున్నా... నాకు అన్నం పెట్టిన కళామతల్లిని వదిలేయలేదు. ఈ సినిమా కోసం తన వంత కృషి చేశా అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ సినిమాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేశామని తెలిపారు. మిగతా హీరోలతో పోల్చితే తనకు అంత బిజినెస్ రాకపోవచ్చని, తన దృష్టి ఎప్పుడూ సినిమాలపై ఉంటుంది తప్పా.. బిజినెస్‌పై కాదని పవన్ స్పష్టం చేశారు. రత్నం వంటి నిర్మాతకు ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశంతోనే తాను ముందుకు వచ్చానని వివరించారు. సినిమాలో బాబీ డియోల్‌ను ఎంతో అద్భుతంగా చూపించారని పవన్ ప్రశంసించారు.
ALSO READ : సినిమాను అనాథగా వదిలేయలే.. అండగా ఉన్నానని చెప్పేందుకు వచ్చాను: పవన్ కళ్యాణ్
చివరగా, సినిమా ప్రమోషన్‌ను సింగిల్ హ్యాండ్‌గా నిధి అగర్వాల్ చాలా అద్భుతంగా చేశారని పవన్ ప్రశంసించారు. "ఈ సినిమాను అనాథగా వదిలేయలేదు... నేనున్నా అని చెప్పేందుకు వచ్చా" అని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. తన సినిమాను తాను ఎందుకు వదిలేస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో, పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారనే ఊహాగానాలకు తెరపడింది.
క్రిష్ జాగర్లమూడి , ఎఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీరమల్లు 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కించారు.