నేను దేవుడి కింద లెక్క : పవన్ 

   నేను దేవుడి కింద లెక్క : పవన్ 

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ‘యువశక్తి’ పేరిట జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ఉద్వేగంగా మాట్లాడారు. అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువతను ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేశారు. పదునైన పంచులు, యాస, భాషతో ప్రత్యర్థులకు చురకలంటించారు. పవన్ కల్యాణ్ ఏమన్నారో ఓ సారి చూద్దాం..

పోరాటం చేయడమే తెలుసు

సినిమాలు చేస్తున్నప్పటికీ తన మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించే ఆలోచిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. 'నా కోసం తొలిప్రేమ, ఖుషి సినిమాల వరకే పోరాటం చేశాను. నాకు పిరికితనం మహా చిరాకు. సత్యాన్ని, సాహసాన్నే నమ్ముకున్నాను. మహా అయితే ఏమవుతుంది..? నా ప్రాణం పోతుంది. నేను గెలుస్తానో.. ఓడిపోతానో తెలియదు.  పోరాటం చేయడం ఒకటే తెలుసు. గూండాగాళ్లను, వెధవలను ఎలా తన్నాలో నాకు బాగా తెలుసు. భాష, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నవి కావు. వీటన్నింటిని దాటుకుని గుర్రం జాషువా ప్రవచించిన విశ్వనరుడి వైపు పయనించడమే ప్రతి మనిషి లక్ష్యం కావాలి’ అంటూ రణస్థలం వేదికగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

అనాడే వైఎస్ ను ఎదుర్కొన్న

‘మూడు ముక్కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్..  నేను మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొన్నాను. పంచలు ఊడదీసి కొడతాను అన్న వాడిని. ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్న’ అని అన్నారు. రాజు సరైనోడు కాకపోతే సగం రాజ్యం నాశనమవుతుందని, సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా నాశనమవుతుందని తనదైన స్టైల్లో ఆరోపించారు. 

సెల్యూట్ కొట్టడం చేతకాదు..

తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని, తెలుగు నేల, దేశం బాగుండాలనే వచ్చానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ‘జైలుకెళ్లిన ఖైదీ నంబర్‌ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా..? ఖైదీ నంబర్‌ 6093కి సెల్యూట్‌ కొట్టడం నా  వల్లకాదు. పోలీసునైతే చచ్చిపోతా’ అంటూ కామెంట్స్ చేశారు. 

దేనికైనా సిద్ధమే..

‘పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. నా అకౌంట్ లో కేవలం రూ.13 లక్షలే ఉన్నాయి. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా యాత్ర మొదలుపెట్టాను. ఎక్కడిక్కడ అంబేద్కర్ భవన్ లలో, కల్యాణమండపాల్లో బస చేసేవాడిని. అయినా నేను చూడని డబ్బా..? నేను చూడని పేరు ప్రఖ్యాతలా..? కానీ, ప్రజల తరఫున ప్రజల్లో ఒకడిగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. రోడ్డు మీద పడుకోవడానికైనా నేను సిద్ధమే. కావాలనుకుంటే ఈ క్షణం సుఖాలను వదిలేయగలను’ అని పవన్ వ్యాఖ్యానించారు. 

ఓటమిని గాయంగా భావించా

‘గత ఎన్నికల్లో నా సభలకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ, ఓట్లేసే సమయానికి నన్ను వదిలేశారు. చట్టసభల్లో ఎదిరించి నిలబడేందుకు అవసరమైన సత్తా ఇవ్వలేకపోయారు. రెండు చోట్ల ఓడిపోయావని కించపరుస్తూ ఉంటే దాన్ని యుద్ధం తాలూకు గాయంగానే భావించాను. అంతేతప్ప నేనే బాధపడలేదు. అవమానంగా భావించలేదు’ అని యువతను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. 

తాను తిట్టడానికి రాలేదని, మాటలు పడుతున్నా బాధ లేదన్నారు. సిన్మాల్లోనే ఉంటే ఇప్పుడు తిట్టేవాళ్లే తనతో సెల్ఫీలు దిగేవాళ్లే అని చెప్పారు. స్టార్ అయినా తనకు ఆనందం లేదని, పేదల కోసం తిట్లుపడ్డా సంతోషమే అన్నారు. సిన్మాల్లో 2 గంటల్లో కష్టాలను పరిష్కరించవచ్చని, కానీ, నిజ జీవితంలో మాత్రం అలా కాదన్నారు. తాను రెండు చోట్ల ఓడిపోయిన దానిపైనా మాట్లాడారు. రెండు చోట్ల తనకు ఓటమి యుద్ధ గాయాలే తప్ప ఫెయిల్యూర్ కాదన్నారు. 

మరోవైపు మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు. సంబరాల రాంబాబూ పిచ్చికూతలు ఆపి పనిచూడు అంటూ సెటైర్ వేశారు. సీఎం జగన్ కు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పిచ్చి ఉందంట అని వ్యంగ్యంగా మాట్లాడారు. తనపై ఇంటెలిజెన్స్ వద్దన్నారు. డబ్బులే వృథా అవుతాయని చెప్పారు. 

‘ఆశయం ఉన్నవాడికి ముందడుగే ఉంటుందని నమ్మేవాడిని. ఈ రణస్థలంలో మాట ఇస్తున్నా. తుదిశ్వాస విడిచే వరకూ రాజకీయాలను వదిలివెళ్లను.  ప్రజల వెన్నంటే ఉంటాను. దీన్ని నా మూడో తీర్మానంగా తీసుకోండి’ అని రణస్థలంలో నిర్వహించిన ‘యువశక్తి’ సభలో యువతను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు.