మంగళగిరిలో పవన్ కళ్యాణ్ దీక్ష

మంగళగిరిలో పవన్ కళ్యాణ్ దీక్ష

ఏపీలో దీక్షకు దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ సంఘీభావ దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులర్పించారు. అలాగే విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణాలర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. 

దీక్షకు ముందు గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌కు వెళ్లేదారిలో వడ్డేశ్వరంలో పవన్ కల్యాణ్  శ్రమదానం చేశారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేశారు. పార, గమేళా చేతబట్టి స్వయంగా మట్టిని పోశారు. కార్యక్రమం ప్రారంభంలో ఒక్కసారిగా అభిమానులు తోసుకురావడంతో స్థానిక జనసేన నాయకులు కిందపడిపోయారు. దీంతో ప్రశాంతంగా ఉండాలని అభిమానులకు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పారు. దీక్ష విరమించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగ గత 300 రోజులుగా పైగా కార్మికులు ఆందోళన కొనసాగుతోంది. దీంతో వారికి నైతిక మద్దతు అందిస్తూ పవన్ దీక్ష చేపట్టినట్లు జనసేన పార్టీ నేతలు తెలిపారు.