
మాస్, కమర్షియల్ సినిమాలు చేసే స్టార్స్.. ఉన్నట్టుండి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో నటించడమంటే కొంత కష్టమే. కానీ వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో అది సాధ్యమేనని ప్రూవ్ చేశారు పవన్ కళ్యాణ్. ఎలాంటి న్యూ జానర్ మూవీ అయినా పవన్ నటిస్తున్నారంటే అది కమర్షియల్ ఫార్మాట్‌లోకి వచ్చేస్తుంది. అందుకే తెలుగులో మెప్పించిన ‘భీమ్లానాయక్’ ఇప్పుడు హిందీ ప్రేక్షకుల ముందుకెళ్లబోతోంది. అతి త్వరలో ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ తరహాలోనే మరో రీమేక్ మూవీలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు.
తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహిస్తూ కీలకపాత్ర పోషించిన చిత్రం ‘వినోదాయ సిత్తం’. తంబిరామయ్య లీడ్ రోల్ చేశాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో ఓటీటీ ద్వారా రిలీజైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ రీమేక్‌లో పవన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులోనూ సముద్రఖనియే డైరెక్ట్ చేయనున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్, సముద్రఖని కలిసి పవన్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ కూడా ఇందులో నటించనున్నాడని, ఈ నెలలోనే స్టార్ట్ చేస్తారని ఇండస్ట్రీ టాక్. ఓ యాక్సిడెంట్‌లో చనిపోయిన వ్యక్తి, తన కుటుంబ బాధ్యతలు తీర్చడం కోసం దేవుణ్ని మూడు నెలల గడువు అడుగుతాడు. అందుకు అనుమతించడమే కాకుండా అతనితో పాటు భూమ్మీదికి వస్తాడు దేవుడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ వార్త కనుక నిజమైతే ‘గోపాల గోపాల’ తరహాలో మరోసారి దేవుడిగా కనిపించనున్నారు పవన్.