
‘వకీల్‌సాబ్’తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన పవన్.. సంక్రాంతికి ‘భీమ్లానాయక్’గా రాబోతున్నాడు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలకి కూడా కమిట్‌మెంట్ ఇచ్చి మరో రెండేళ్లకు సరిపడా సినిమాలతో తన డైరీని నింపేసుకున్నాడు. ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ పనుల్లో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఈ మూవీ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది పూర్తవ్వగానే ‘హరిహర వీరమల్లు’ మూవీ సెట్స్‌లో తిరిగి జాయినవబోతున్నాడు. మొఘులుల కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఢిల్లీ, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలను పరిశీలిస్తోంది టీమ్. రాజస్థాన్ ఎడారుల్లో ఓ పెద్ద సెట్ వేయాలనుకుంటున్నారట. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి క్రిష్ అక్కడికి వెళ్లాడు. వచ్చే నెలాఖరులో కానీ, జనవరి ఫస్ట్ వీక్‌లో కానీ షూట్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రామ్‌పాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.