
బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన దాసోజు శ్రవణ్ కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. " తెలంగాణ నాయకుడు దాసోజు శ్రవణ్ గొప్ప బలమైన నాయకుడు. గతంలో పీఆర్పీ నుంచి టీఆర్ఎస్ లోకి తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం చేరారు. శ్రవణ్ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, నిత్యం తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షలు, తెలంగాణ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటారు.శ్రవణ్ భవిష్యత్తులో తలపెట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పవన్ ట్వీట్ చేశారు. కాగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. పాలిటిక్స్ లో శ్రవణ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ తన రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించే బదులు మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.