
న్యూఢిల్లీ: స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‌దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. సోమవారం (మే 5) తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్న కారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పవన్ దీప్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నోయిడాకు తరలించారు. నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పవన్ దీప్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇందులో అతడి కాళ్లు, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలు అయినట్లు అర్ధమవుతోంది. ఇది చూసి.. పవన్ దీప్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం పవన్‌దీప్ హెల్త్ కండిషన్ విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఏప్రిల్ 27వ తేదీన పవన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇంతలోనే ఘోర ప్రమాదానికి గురికావడంతో పవన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.
ఎవరీ పవన్‌దీప్ రాజన్..?
సింగర్ పవన్దీప్ది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లా. అతడి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మ్యూజికే. పవన్ తల్లి సరోజ్ రాజన్, తండ్రి సురేష్ రాజన్, సోదరి జ్యోతిదీప్ రాజన్ ప్రసిద్ధ కుమావోని జానపద సంగీతకారులు. కుటుంబ నుంచి సంగీతాన్ని పునికిపుచ్చుకున్న పవన్‌దీప్ కేవలం 2 సంవత్సరాల వయసులోనే అతి చిన్న తబలా ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. చిన్నతనం నుంచే సంగీతంలో రాణిస్తోన్న పవన్ దీప్.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ 12ను గెలుచుకున్నాడు. దీంతో పవన్‌దీప్ రాజన్ పేరు మోరుమోగిపోయింది.
►ALSO READ | సంధ్య థియేటర్ తొక్కిసలాట: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్