ఒకటో తేదీన జీతాలు ఇప్పించండి : కొత్త సర్కారుకు పీఆర్టీయూ వినతి

ఒకటో తేదీన జీతాలు ఇప్పించండి : కొత్త సర్కారుకు పీఆర్టీయూ వినతి

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, కమలాకర్​రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, పూల రవీందర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా కోరుకుంటున్నట్టుగా ప్రతినెలా ఒకటో తారీఖున వేతనాలు అందించేలా, పెండింగ్​ బిల్లులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలో సర్కారు విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందనే నమ్మకం ఉందని, దీనికి తమ సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.  

సీఎం రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

చీఫ్ మినిస్టర్​గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులకు టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు మంత్రులూ ప్రజలకు అందుబాటులో ఉండి, పరిపాలన కొనసాగించాలని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని ఆయన కోరారు.